కన్విన్స్ చేయడం వల్లే సినిమాల్లోకి వచ్చా

కన్విన్స్ చేయడం వల్లే  సినిమాల్లోకి వచ్చా

డాక్టర్ల కుటుంబంలో పుట్టింది.. యాక్టర్‌‌గా టాప్ పొజిషన్‌కి వెళ్లింది.అందంతో అందరినీ ఆకట్టుకుంది.. పర్‌‌ఫార్మెన్స్‌తో ఫుల్ మార్కులు వేయించుకుంది.ఐదు భాషల్లో హీరోయిన్‌గా చక్రం తిప్పిన ఆమె ఎవరో కాదు.. గౌతమి.గౌతమి అంటే సినిమా ఒక్కటే కాదు.. అంతకుమించి ఎంతో ఉంది.ఊహలు తల్లకిందులైనా.. ఊహించని పరిణామాలు కలవరపెట్టినా.. కంగారుపడకుండా ముందుకు సాగుతోంది.ఆ గౌతమీ నదిలాగే పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తూనే ఉంది.ఇవాళ తన యాభై మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది.ఈ సందర్భంగా గౌతమి ఇన్‌స్పైరింగ్‌ జర్నీ గురించి కొన్ని సంగతులు..

 

అప్పట్లో చాలామంది గౌతమిని తమిళ అమ్మాయి అనుకునేవారు. ఇప్పటికీ కొందరు అనుకుంటారు. కానీ గౌతమి అచ్చ తెలుగు మహిళ. 1969లో శ్రీకాకుళంలో పుట్టారామె. తల్లిదండ్రుల వృత్తిరీత్యా గౌతమి చదువంతా రకరకాల ప్రాంతాల్లో సాగింది. ఫస్ట్ క్లాస్ వైజాగ్‌లో.. సెకెండ్ క్లాస్ కేరళలో చదివారు. మూడో తరగతి నుంచి టెన్త్ వరకు బెంగళూరులోని బిషప్ కాటన్ గాళ్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వైజాగ్ వచ్చి ఎంసెట్ రాసి, ట్రిపుల్ ఈ సీటు సాధించారు. ఇంజినీరింగ్‌లో చేరగానే సినిమా అవకాశం రావడంతో అటువైపు అడుగులు వేశారు. గౌతమి తండ్రి ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. తల్లి ప్యాథాలజిస్ట్. దాంతో గౌతమిని, ఆమె అన్నయ్యని కూడా బాగా చదివించాలనుకున్నారు. కానీ గౌతమి ఇష్టానికి మాత్రం అడ్డు చెప్పలేదు. చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చని, ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావని వాళ్లు కన్విన్స్ చేయడం వల్లే తాను సినిమాల్లోకి వచ్చానని గౌతమి ఓ సందర్భంలో చెప్పారు.  విజయ్ చందర్ తీసిన ‘దయామయుడు’ సినిమాతో గౌతమి కెరీర్‌‌ మొదలయ్యింది. విజయ్ చందర్ సిస్టర్‌‌ గౌతమి కజిన్‌కి వైఫ్. ఎమ్‌సెట్‌ కోసం గౌతమి వైజాగ్ వచ్చేటప్పటికి ఆ సినిమా గురించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. దాంతో ఓ పాత్ర చేయమని గౌతమిని అడిగారు. టీమ్ అంతా తెలిసినవాళ్లు కావడం, పేరెంట్స్ కూడా ఓకే అనడంతో ఎస్ చెప్పారామె. అది చిన్న క్యారెక్టరే అయినా అందరి దృష్టిలోనూ పడ్డారు గౌతమి. 

గౌతమి పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ‘గాంధీనగర్ రెండో వీధి’. రాజేంద్ర ప్రసాద్ హీరో. ‘దయామయుడు’ సినిమా రిలీజవ్వగానే గౌతమిని చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు పీఎన్ రామచంద్రరావు ఏరి కోరి గౌతమిని తన సినిమాకి హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాతో ఆమెకి చాలా మంచి పేరొచ్చింది. వెంకటేష్‌తో కలిసి నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’తో కెరీర్ మలుపు తిరిగింది.

తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ పాపులారిటీ వచ్చింది గౌతమికి. తన మూడో సినిమా కన్నడలో చేసిన గౌతమి.. ఐదో సినిమా తమిళంలో చేశారు. అదే ‘గురుశిష్యన్’. ‘ఇన్‌సాఫ్‌కీ పుకార్’ అనే హిందీ సినిమాకి రీమేక్ ఇది. రజినీకాంత్ హీరో. మొదటి సినిమాతోనే తమిళ ప్రేక్షకులకి బాగా నచ్చేశారు గౌతమి. అందుకే ఇతర భాషల్లోనూ సినిమాలు చేసినా తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చాన్సెస్ వచ్చాయి. అది కూడా ప్రెస్టీజియస్ సినిమాలు కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయారామె. అప్పటికి ఫామ్‌లో ఉన్న ఖుష్బూ, రేవతి, అమల, భానుప్రియలకు గట్టి పోటీనిచ్చారు. నకాబ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు గౌతమి. మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ లాంటి ఫేమస్ హీరోలతో నటించారు. ఆద్మీ, జనతాకీ అదాలత్, తీస్‌రా కౌన్, వీర్, గాడ్ అండ్ గన్, త్రిమూర్తి లాంటి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు.

 

గౌతమి ఎంత బిజీగా ఉండేవారంటే.. చిరంజీవితో నటించే చాన్స్ వచ్చినా వచ్చినా ఖాళీ లేక నో అన్నారు. బాలకృష్ణ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో కూడా తనే యాక్ట్ చేయాలి. అదీ వీలు కాలేదు. చిరంజీవితో నటించే చాన్స్ వచ్చిన ప్రతిసారీ వేరే సినిమాకి కమిటై ఉండటం వల్ల నో అనాల్సి వచ్చిందని ఓ సందర్భంలో చెప్పారు. ఆ విషయంలో ఇప్పటికీ ఫీలవుతానని అంటుంటారు గౌతమి. అర్జున్ హీరోగా శంకర్ తీసిన ‘జెంటిల్‌మేన్’ మూవీలో ‘చికుబుకు చికుబుకు రైలే’ అనే పాటలో ప్రభుదేవాతో కలిసి నటించారు గౌతమి. శంకర్‌‌ క్యాసెట్ తీసుకెళ్లి, పాట వినిపించి, సినిమాకి హైలైట్ అవుతుంది చేయమని రిక్వెస్ట్ చేయడంతో గౌతమి ఒప్పుకున్నారు. ఆ పాట సెన్సేషనల్ హిట్టయ్యింది. దాంతో తర్వాత చాలామంది ఐటమ్ సాంగ్స్ చేయమని గౌతమిని అడిగారు. కానీ ఆవిడ ఇష్టపడలేదు. తనకి ముందు నుంచే పరిచయం ఉన్న డైరెక్టర్ శంకర్, ప్రభుదేవాలు అప్పుడే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో వాళ్లకి హెల్ప్ చేయడానికే ఆ పాటలో యాక్ట్ చేశాను తప్ప అలాంటి సాంగ్స్ చేసే ఉద్దేశం తనకి లేదని చెప్పేశారు గౌతమి. 1998 వరకు గౌతమి కెరీర్ తిరుగు లేకుండా సాగింది. ఆ తర్వాత ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. కారణం.. బిజినెస్‌మేన్ సందీప్ భాటియాతో పెళ్లి. 1999లో వారికి ఓ పాప పుట్టింది. కానీ కొన్నాళ్లకే వారి దారులు వేరయ్యాయి. విడాకులు తీసుకున్నారు. దాంతో కూతురి ఆలనా పాలనా చూడటం కోసం నటనకు దూరంగా ఉన్నారు గౌతమి. 2003లో రీ ఎంట్రీ ఇచ్చి ఒక మలయాళ సినిమా, ఒక తమిళ సినిమా చేశారు. తర్వాత తొమ్మిదేళ్లపాటు గ్యాప్. మళ్లీ 2015లో ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశం’తో నటించడం మొదలుపెట్టారు.      

మొదటి భర్త నుంచి విడిపోయిన ఐదేళ్ల తర్వాత కమల్ హాసన్‌తో కలిసి జీవించడం మొదలుపెట్టారు గౌతమి. పదమూడేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న తర్వాత పొరపొచ్చాలు వచ్చాయి. ఇద్దరూ సెపరేట్ అయిపోయారు. తన జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణం అదేనని, కమల్‌తో విడిపోవాలనుకోవడం తాను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమని, తన హృదయం ముక్కలైందని ఎంతో బాధతో ప్రకటించారు గౌతమి. కెరీర్ మొత్తంలో నూట ఇరవైకి పైగా సినిమాలు చేసిన గౌతమి రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. 1997లో బీజేపీలో చేరారు. వాజ్‌పేయ్‌ తరపున ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విరివిగా ప్రచారం చేశారు. కూతురు పుట్టాక కాస్త విరామం ఇచ్చినా 2017లో మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు.

వెండితెరపై యేళ్ల పాటు వెలిగిన గౌతమి బుల్లితెరపైనా బిజీనే. చిన్న చిన్న ఆశై, ఇందిర, అభిరామి లాంటి సీరియల్స్ చేశారు. ఉగ్రమ్ ఉజ్వలమ్, డ్యాన్స్ జోడీ డ్యాన్స్ లాంటి షోస్కి జడ్జిగా వ్యవహరించారు. అడపా దడపా ఏదో ఒక షోకి గెస్టుగానూ వెళ్తుంటారు. ‘అన్బుదన్ గౌతమి’ అనే ఆన్‌లైన్ షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు సీజన్స్ పూర్తయ్యాయి. మూడోది నడుస్తోంది.గౌతమి క్యాన్సర్ సర్వైవర్. ముప్ఫై అయిదేళ్ల వయసులో ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ధైర్యంగా పోరాడి గెలిచారు. అప్పటికి నాలుగున్నరేళ్ల వయసున్న తన కూతురు ఏమైపోతుందోననే ఆలోచనే వ్యాధిని జయించాలనే పట్టుదలను తనలో పెంచిందని చెబుతుంటారు గౌతమి. ఆ తర్వాత లైఫ్ అగైన్‌ ఫౌండేషన్‌ని స్థాపించి క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. మూడొందల అరవైకి పైగా మోటివేషనల్ క్యాంప్స్ నిర్వహించారు. యోగా లాంటి ఆల్టర్నేటివ్ థెరపీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు. రెండు మొబైల్ హాస్పిటల్స్ కూడా నడుపుతున్నారు. అలాగే పేద పిల్లల చదువులకి స్పాన్సర్ కూడా చేస్తున్నారు గౌతమి. సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ సెంటర్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్‌ కూడా రన్ చేస్తున్నారు.

ఇదీ గౌతమి లైఫ్. చెప్పుకోడానికి సింపుల్‌గానే ఉంటుంది కానీ తన జీవితం పైకి కనిపించినంత సింపుల్ కాదంటారామె. విడాకులు, బ్రేకప్‌లు, క్యాన్సర్తో కష్టాలు.. ఒంటరితనంతో నిద్రలేని రాత్రులు.. ఒకటీ రెండూ కాదు, ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు గౌతమి. అన్నింటినీ అధిగమించారు. ధైర్యంగా ముందడుగేశారు. ప్రస్తుతం పాలిటిక్స్తోను, సినిమాలతోను బిజీగా ఉన్నారు. త్వరలో డిటెక్టివ్ 2, శాకుంతలమ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆవిడ మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ.. గౌతమికి పుట్టినరోజు శుభాకాంక్షలు.