- అప్పుడే పుట్టిన బిడ్డను టాయిలెట్ వద్ద వదిలిపోయిన తల్లి
- వెస్ట్ బెంగాల్లో ఘటన
నబద్వీప్: వీధి కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు తరచూ చూస్తున్నాం. చిన్నపిల్లలను కరిచి చంపేసిన దారుణాలు కూడా అనేకం జరిగాయి. కానీ, వెస్ట్ బెంగాల్ లోని నబద్వీప్ టౌన్ లోని వీధి కుక్కలు.. రోడ్డుపై పడి ఉన్న ఓ పసికందును రాత్రంతా కాపలా కాసి మరీ రక్షించాయి. స్థానిక మహిళ వచ్చి.. ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
నబద్వీప్ టౌన్ లోని స్వరూప్ నగర్ రైల్వే కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఎవరో ఓ మహిళ అప్పుడే ప్రసవించిన మగబిడ్డను కాలనీలోని ఓ ఇంటి టాయిలెట్ వద్ద పడుకోబెట్టి వెళ్లిపోయింది. రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తున్న పసికందును చూసిన వీధి కుక్కలు అక్కడికి వచ్చాయి. శిశువు చుట్టూ రక్షణగా నిలబడ్డాయి.
పసికందు ఏడుపులు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు.. ఏదో ఓ ఇంట్లో శిశువు ఏడుస్తుండవచ్చని భావించారు. చివరకు తెల్లవారుతుండగా టాయిలెట్ కోసమని బయటకు వచ్చిన రాధా భౌమిక్ అనే మహిళ కుక్కల మధ్య ఉన్న పసికందును చూసింది. పరుగుపరుగున వచ్చి బిడ్డను ఎత్తుకుంది. బిడ్డను మహిళ ఎత్తుకుని లాలించడంతో.. ఇక సేఫ్ అనుకున్న కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
తర్వాత పసికందును ఆస్పత్రికి తరలించారు. తలపై ప్రసవం సందర్భంగా అంటిన రక్తం తప్ప.. ఎలాంటి గాయాలు కాలేదని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రిలో చెకప్ తర్వాత ఆ శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చైల్డ్ కేర్ హోంకు తరలించారు. బిడ్డను వదిలివెళ్లిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
