
- ఆగస్టు 25 తర్వాత టెంపరరీగా రద్దు
- యూఎస్ కొత్త కస్టమ్స్ నిబంధనలు, టారిఫ్‌లే కారణం
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వేళ ఇండియన్ పోస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికాకు పోస్టల్‌సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 25 తర్వాతి నుంచి యూఎస్‌కు అన్ని రకాల పోస్టల్‌సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఇండియన్ పోస్టల్ విభాగం తెలిపింది. ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే అమెరికా కస్టమ్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
జులై 30న అమెరికా అడ్మినిస్ట్రేషన్ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల (రూ. 70వేలు) విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకున్నది. దీంతో అన్ని అంతర్జాతీయ పోస్టల్ ఐటమ్స్‌పై కస్టమ్స్ డ్యూటీలు విధిస్తారు. ఈ నెల 29 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ పోస్టల్ షిప్‌మెంట్‌పై డ్యూటీలను సేకరించడానికి, చెల్లించడానికి ట్రాన్స్‌పోర్ట్ క్యారియర్లు లేదా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఆమోదించిన ‘క్వాలిఫైడ్ పార్టీస్’ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
అయితే, ‘క్వాలిఫైడ్ పార్టీస్’ ఎవరనేది, డ్యూటీ సేకరణ విధానాల గురించి స్పష్టత లేదు. అలాగే, ట్రంప్ సర్కారు ఇటీవల విధించిన టారిఫ్‌ల వసూళ్లకు సంబంధించి సీబీపీ వద్ద కచ్చితమైన గైడ్‌లైన్స్ లేవు. ఈ అనిశ్చితి వల్ల ఆగస్టు 25 తర్వాత అమెరికాకు వచ్చే పోస్టల్ కన్‌సైన్‌మెంట్లను స్వీకరించలేమని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. దీంతో యూఎస్‌కు పంపే పోస్టల్ బుకింగ్‌లను ఇండియన్ పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది