
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అరుణ్ మాలిక్ తనను అవమానించాడని, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడని స్టార్ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్ ఆరోపించింది. జులై 8న జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో మాలిక్ తనను అవమానించే వ్యాఖ్యలు చేశాడని, తాను సాధించిన ఘనతలను చిన్నవి చేసి మాట్లాడాడని పేర్కొంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) అధికారులు పాల్గొన్న ఈ మీటింగ్‌లో తన పర్సనల్ కోచ్‌ను నేషనల్ క్యాంప్‌కు అనుమతించాలని కోరగా మాలిక్ అందుకు అంగీకరించకుండా ‘నోరు మూసుకో. తలదించుకుని మేము చెప్పినట్లు చేయి’ అని ఆక్షేపించాడని తన ఫిర్యాదులో వివరించింది.
ఈ మాటలు అవమానకరంగా అనిపించాయని, తనను చిన్నతనంగా, బలహీనంగా భావించేలా చేశాయని లవ్లీనా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణలను కల్నల్ అరుణ్ మాలిక్ ఖండించారు. బీఎఫ్‌ఐ నిబంధనల ప్రకారం పర్సనల్ కోచ్‌లను నేషనల్ క్యాంప్‌లకు అనుమతించబోమని, రూల్స్ అందరికీ సమానమేని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా, సాయ్, టాప్స్ విభాగం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ), బీఎఫ్‌ఐకి లవ్లీనా ఫిర్యాదు చేసింది.
దాంతో రంగంలోకి దిగిన ఐఓఏ.. టాప్స్ సీఈఓ ఎన్.ఎస్. జోహల్, ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్ శరత్ కమల్, ఓ మహిళా న్యాయవాదితో ఐఓఏ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అరుణ్ మాలిక్, లవ్లీనా మధ్య సంభాషణ మొత్తం వీడియో రికార్డ్ అయిందని, త్వరలోనే కమిటీ సమావేశమై నివేదికను సమర్పిస్తుందని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. మాలిక్ కూడా విచారణను వేగవంతం చేయాలని, వీడియో రికార్డింగ్‌ను తనకు అందించాలని కమిటీని కోరారు. కాగా, ఈ వివాదంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, ఆటపైనే దృష్టి సారిస్తానని లవ్లీనా స్పష్టం చేసింది.