గుర్రం ఎక్కితే ప్రాణం తీసింది

గుర్రం ఎక్కితే ప్రాణం తీసింది

శంషాబాద్, వెలుగు: గుర్రం దాడిలో ఓ బాలుడు మృతిచెందాడు. శంషాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం… బహదూర్​పురాకు చెందిన అజ్దారి షరీఫ్ కుటుంబంతో కలిసి ఆదివారం జహంగీర్ పీర్ దర్గాను సందర్శించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో  శంషాబాద్ మండలం గండిగూడ వద్ద గల అరేబియన్ రెస్టారెంట్ కి వచ్చారు. అక్కడి ప్లే గ్రౌండ్ లో ఒంటెలు, గుర్రాలు ఉండటంతో షరీఫ్​ కుమారుడు బాకుర్(3) గుర్రంపై ఎక్కాడు. సిబ్బంది మెయింటెనెన్స్ లేకపోవడంతో గుర్రం అటు ఇటు కదలగా దానిపై ఉన్న బాకుర్​ కిందపడ్డాడు.

గుర్రం బాలుడిని తన్నుకుంటూ వెళ్లింది. తీవ్రగాయాలైన బాకుర్ ని తల్లిదండ్రులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే బాకుర్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. షరీఫ్​ కంప్లయింట్ మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్ రూరల్ పోలీసులు తెలిపారు. అరేబియన్ రెస్టారెంట్ కి అక్కడ పర్మిషన్ లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందినదిగా తెలుస్తోంది. గతంలో నిర్మాణ సమయంలోనే గ్రామపంచాయతీ సిబ్బంది అనుమతులు లేకుండా కడుతున్నందుకు దాన్ని కూల్చివేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ నిర్మించి రెస్టారెంట్ కొనసాగిస్తున్నారు.