ఏడాది తర్వాత తల్లిదండ్రుల దరికి బాలుడు

ఏడాది తర్వాత తల్లిదండ్రుల దరికి బాలుడు

తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడి అచూకీ సంవత్సరం తర్వాత లభించింది. మంగళవారం చందానగర్​ పోలీసులు బాలున్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దొడికొండ గ్రామానికి చెందిన పి. లక్ష్మణ్​ హైదరాబాద్​ నగరంలోని ఎల్​బీనగర్​లో స్క్రాప్​ దుకాణంలో  పనిచేస్తున్నారు.  2018 సంవత్సరం ఏప్రిల్​ 24న రాత్రి  తన  కుమారుడు ప్రతాప్​ రవి(8)తో కలిసి కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. రైలు ప్రయాణంలో నిద్ర పోయిన లక్ష్మణ్​ జడ్చర్ల స్టేషన్​ రాగానే నిద్ర లేచారు. పక్కన చూసే సరికి తన కుమారుడు లేక పోవడంతో ఆందోళన చెంది చుట్టూ గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటి నుంచి లక్ష్మణ్​ తన కుమారుడి కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు.  మంగళవారం చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గోపాన్​పల్లిలో వడ్డెర వేణు భార్య కమల తన కుమారున్ని ఎండలో ఎందుకు తిరుగుతున్నావ్​ అని కొట్టింది. దీంతో వేణు సోదరి బాబును ఎందుకు కొడుతున్నావ్​ అంటూ గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి గొడవకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరా తీయగా తాము  బాలుడు  ప్రతాప్​ రవిని పెంచుకుంటున్నామని  వడ్డెర వేణు, అతని భార్య కమల పోలీసులకు తెలిపారు. పోలీసులు బాలున్ని చేరదీసి  మీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అరాతీయగా తన గ్రామం దొడికొండ అని పోలీసులకు తెలిపాడు. బాలుడు చెప్పిన వివరాలతో ఎస్​ఐ అహ్మద్​ పాషా తెలిసిన వ్యక్తుల ద్వారా  బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  మంగళవారం సాయంత్రం సీఐ రవీందర్​, ఎస్​ఐలు, రమేష్​,  అహ్మద్​ పాషాలు బాలున్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తమ కుమారుడు సంవత్సరం తర్వాత తిరిగి తమ వద్దకు చేరడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారున్ని వెతికి తమకు అప్పగించినందుకు చందానగర్​ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.