బూట్లతో రణ్ బీర్ గుళ్లోకి వెళ్లడంపై డైరెక్టర్ స్పందన

బూట్లతో రణ్ బీర్ గుళ్లోకి వెళ్లడంపై డైరెక్టర్ స్పందన

రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం బ్రహ్మాస్త్రకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజై భారీ స్పందనను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ లో ఒక సన్నివేశంలో హీరో రణ్ బీర్... బూట్లు తొడుక్కొని గుడిలోకి ప్రవేశించాడనే వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుళ్లోకి షూ తో రావడాన్ని ఖండిస్తూ.. పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుత వివాదంపై స్పందించారు. ఇటీవల తాము విడుదల చేసిన ట్రైలర్ లో శివ పాత్రలో ఉన్న రణ్ బీర్ బూట్లు ధరించడాన్ని తప్పుపట్టడం తమను తీవ్రంగా కలచివేసిందన్న ఆయన.. ఈ చిత్రం యొక్క సృష్టికర్తగా ( ఒక భక్తుడిగా) ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవడం వ్యక్తిగతంగా తనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా ట్రైలర్ లో రణ్ బీర్ పరుగెత్తుకుంటూ వెళ్లింది గర్భగుడిలోకి కాదు... పూజా మండపంలోకేనని అన్నారు. 

"దాదాపు75 సంవత్సరాల నుంచి నా కుటుంబం దుర్గాపూజ వేడుకలను నిర్వహిస్తోంది. ఆ అనుభవం ప్రకారం.. దేవత ఉన్న వేదికపైకి మాత్రమే మేము పాదరక్షలు లేకుండా వెళ్తాం.  కానీ మండపం(ఆవరణలోకి) ప్రవేశించినప్పుడు కాద"ని అయాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సంఘటనతో ఎవరైనా కలత చెందితే... వారికి సమాధానం చెప్పుకోవడం తనకు చాలా ముఖ్యమని అన్నారు.  ఎందుకంటే అన్నింటికంటే మించి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చరిత్రకు గౌరవం ఇచ్చే విధంగా  బ్రహ్మాస్త్ర సృష్టించబడిందన్న ఆయన... ప్రతీ భారతీయుడికీ బ్రహ్మాస్త్ర మూవీ గొప్ప అనుభూతిని కలిగించేలా చేయడం తన కర్తవ్యమని తెలిపారు.