- మార్చి 4న బేగంబజార్ జిన్సీ చౌరాహాలో చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించిన రౌడీ షీటర్
- అతడిని ఆటోతో ఢీకొట్టి.. నిలువరించిన డ్రైవర్
- జాహెర్ సాహసానికి అభినందించి సన్మానించిన సీపీ
- నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత
గోషామహల్, వెలుగు: ఓ ఆటో డ్రైవర్ సాహసోపేతంగా వ్యవహరించి చైన్ స్నాచింగ్‌ను అడ్డుకున్నాడు. మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. తన ఆటోను అడ్డుపెట్టి అడ్డుకున్నాడు. రౌడీ షీటర్కర్రతో దాడి చేస్తున్నా.. బెదరకుండా ప్రతిఘటించాడు. ప్రాణాలకు తెగించి చైన్ స్నాచింగ్‌ను అడ్డుకున్న ఆ ఆటో డ్రైవర్మహమ్మద్జాహెర్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలోని తన చాంబర్లో ప్రత్యేకంగా సన్మానించారు.
ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. మార్చి 4న తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. వారు హిందీ మార్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే.. డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారి పక్కనుంచి వెళ్లిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ లో గమనించాడు. వెంటనే ఆటోను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశాడు. అనంతరం నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతి ఘటించి అడ్డుకున్నాడు. గోషామహల్ పోలీసు పెట్రోలింగ్ వెహికల్ అక్కడికి చేరుకొనే వరకు అతన్ని నిర్బంధించాడు. పోలీసులు వచ్చి రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జాహెర్ ఆచూకీ కోసం గాలింపు
ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన డ్రైవర్ కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఆటో నంబర్ ఆధారంగా ఆటో యజమాని ఫోన్ నంబర్ తీసుకొని ఎట్టకేలకు కిరాయికీ ఆటో నడుపుతున్న మహమ్మద్ జాహెర్ ఆచూకీ కనుకున్నారు.
జాహెర్ సాహసం సమాజానికి ఆదర్శం: సీపీ సజ్జనార్
ఆటో డ్రైవర్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమని సిటీ సీపీ సజ్జనార్అన్నారు. ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను అడ్డుకోవడం గొప్పవిషయమన్నారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుందన్నారు. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా.. జాహెర్ మాదిరిగా ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డబిర్పూరకు చెందిన రౌడీ షీటర్‌పై గోషా మహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.
