దోస్తే కదా అని పులితో ఆడితే..

దోస్తే కదా అని పులితో ఆడితే..

అనగనగాఓ మేకపోతు. పులికి లైవ్ ​ఫుడ్ పెడదామని బోనులోకి వదిలారు. అది అదరలేదు. బెదరలేదు. అలా చూస్తూనే నిలబడింది. ఆకలి మీదున్న పులి ఆవురావురుమంటూ దాని దగ్గరకొచ్చింది. ఆ మేకపోతు ధైర్యాన్ని చూసి ముచ్చటపడింది. ఇక.. ఆ రోజు నుంచీ అవి రెండూ జాన్ జిగ్రీ దోస్తులైపోయినయి. కలిసి తిరిగినయి. కలిసి ఆడినయి. పోటీ పడి పరుగులు తీసినయి. ఒకే బోనులో పండినయి. అలా అలా రోజులు గిర్రున తిరిగినయి. జాతివైరంతో బద్ధశత్రువుల్లా ఉండాల్సిన ఆ దోస్తులను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో..  ఓ రోజు.. పులిని ఆ మేకపోతు తెగ విసిగించేసింది. పట్టరాని చిరాకులో పులి దోస్త్ అని కూడా చూడకుండా చిన్న కొండ మీది నుంచి తోసేసింది! గాయపడ్డ మేకపోతు కన్నుమూసింది! ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కథలా.. మనసును కదిలించేలా ఉన్న ఈ స్టోరీ రష్యాలోని వ్లాదివోస్టాక్ సఫారీ పార్కులో జరిగింది.

ఆ రష్యన్ మేకపోతు పేరు తిమూర్. ఆ సైబీరియన్ పులి పేరు అమూర్. ఇవి రెండూ 2015లో దోస్త్ లయ్యాయి. దాదాపు ఏడాది పాటు ఇవి రెండూ బాగానే ఉన్నాయి. కానీ.. ‘అతి అన్నింటా మంచిది కాదు’ అన్న సంగతిని తిమూర్ మరిచిపోయింది. అమూర్ పులి అన్న విషయం కూడా మరిచిపోయి ఒక పిల్లి కన్నా హీనంగా ఆడుకోసాగింది. రోజురోజుకూ విసిగిపోతున్న అమూర్.. 2016 జనవరిలో ఓ రోజు మహా చిరాకుతో ఓ చిన్న కొండపై నిలబడి ఉంది. ఇంతలో పరుగెత్తుకుంటూ వచ్చిన తిమూర్.. ఏకంగా దాని మీదకు ఎక్కి తొక్కసాగింది. కోపంతో ఊగిపోయిన అమూర్ తన పంజాతో ఒక్కటిచ్చింది. దీంతో కొండపై నుంచి పడిన తిమూర్ కు కాలు విరిగింది. దెబ్బలు బాగా తగిలాయి. అక్కడితో వాటి ఫ్రెండ్షిప్ ముక్కలైపోయింది. ఆ తర్వాత జూ అధికారులు తిమూర్ కు ఎంత జాగ్రత్తగా ట్రీట్ మెంట్ చేస్తూ వచ్చినా.. అది మళ్లీ కోలుకోలేదు. నవంబర్‌ 5న ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. ఎంతో మంది అభిమానుల మధ్య మేకపోతుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. జూలో కాంస్య విగ్రహం కట్టించాలని ఆలోచిస్తున్నారు.

'Brave' Goat Who Had Befriended Tiger it Was 'Meal' For, Passes Away