సర్జరీ సక్సెస్... అవిభక్త కవలలకు విముక్తి

సర్జరీ సక్సెస్... అవిభక్త కవలలకు విముక్తి

బ్రెజిల్ కి చెందిన అవిభక్త కవలలకు విముక్తి లభించింది. యూకేకు చెందిన వైద్యులు విజయవంతంగా వీరిని వేరు చేసినట్టు ఇండిపెండెంట్ ఓ నివేదికలో తెలిపింది. నాలుగు సంవత్సరాల వయసు కలిగిన బెర్నార్డో, ఆర్థర్ లిమా ఇప్పటివరకూ 7 శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. అయితో చాలా ప్రయత్నాల తర్వాత లండన్ లోని గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ నూర్ ఉల్ ఒవాస్ జీలానీ ఈ ఆపరేషన్ కు కావల్సిన మార్గదర్శకం చేశారు. క్రానియోపాగస్ ట్విన్స్  గా పిలిచే ఈ పిల్లల సర్జరీకి డాక్టర్లు చాలా కష్టపడ్డారు. దాదాపు 100మంది డాక్టర్లు ఈ సర్జరీలో పాల్గొన్నారు. 33 గంటలు పాటు శ్రమించి... చివరికి ఆ చిన్నారులకు నూతన జీవితాన్ని ప్రసాదించారు. దీన్ని వారు అద్భుతమైన విజయంగా అభివర్ణించారు.

రెండున్నరేళ్ల క్రితం బ్రెజిలియన్ ఆసుపత్రికి అబ్బాయిల తల్లిదండ్రులు వచ్చారని డాక్టర్ ముఫారెజ్ చెప్పినట్లు UK ఆధారిత మెట్రో పేర్కొంది. అప్పటినుంచీ వారు కూడా ఆసుపత్రిలో అంతర్భాగమైనట్టు తెలిపారు. ఇక వీరు ఈ సర్జరీ చేయించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్థికంగా సహాయం చేసిందని డాక్టర్ జీలానీ చెప్పారు. చాలా మంది వైద్యులు అసలు ఇది అసాధ్యమని భావించారు. కానీ ఇది సాధ్యమని తాము నిరూపించినట్టు ఆయన స్పష్టం చేశారు. 

ప్రపంచంలో దాదాపు 60,000 మందిలో ఒకరికి ఇలాంటి లోపం ఉంటుందని సమాచారం. అయితే సర్జరీ అయిన ఈ ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. చిన్నారులు ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే, వైద్యం తీసుకోవాలని పేర్కొన్నారు.

వీణా- వాణిలు ఇప్పటికీ అలాగే...

అసాధ్యమనుకున్న పనిని లండన్ డాక్టర్లు ఇప్పుడు సాధ్యమని నిరూపించారు. పుట్టుకతోనే అవిభక్త కవలలుగా జన్మించిన బ్రెజిల్‌ సోదరులకు ఇప్పుడు విముక్తి లభించింది. కానీ, వీరిలాగే తలలు అతుక్కుని జన్మించిన మన వీణ-వాణి మాత్రం 20సంవత్సరాలుగా ఇంకా అలాగే వుండి పోయారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వీరికి సర్జరీ చేయాలన్న ప్రతిపాదనలూ వచ్చాయి. ఆ ప్రతిపాదనలు సాగుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ అవిభక్త కవలల కష్టాలు తీరలేదు. వీణ – వాణి ఇద్దరూ ఒకర్ని ఒకరు నేరుగా చూసుకోలేరు. ఒకరు ఒక వైపుకి తిరిగి వుంటే, ఇంకొకరు ఇంకో వైపుకు తిరిగి వుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువులో రాణిస్తున్నారు.