
మొన్న నారాయణపేట, భైంసా, శంషాబాద్ లో నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు
తాజాగా మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, బండ్లగూడ జాగీరు, మీర్పేట్ వంతు
హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, బండ్లగూడజాగీరు, మీర్ పేట్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ సజావుగా సాగలేదనీ, నిబంధనలకు విరుద్ధంగా అశాస్త్రీయంగా విభజించారంటూ దాఖలైన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు బుధవారం ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి అభ్యంతరాలతోనే ఇప్పటికే నారాయణపేట, భైంసా, శంషాబాద్ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రంలోని 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు బ్రేక్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వార్డుల విభజన ప్రక్రియ చట్టప్రకారం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఈసీని ఆదేశించడంతో ఆయా అధికారులు వార్డుల విభజన ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అసెంబ్లీ సెషన్ ముగియగానే షెడ్యూల్..
గురు, శుక్రవారాల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేశాక రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రిజర్వేషన్ 50 % మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇందులో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా మున్సిపల్ అధికారులు రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. రిజర్వేషన్లు ఖరారైన మరు సటి రోజే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికా రులు భావిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు రెండో వారంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ వెల్లడించారు.