
- మల్యాలలోని బాలుర అర్బన్ రెసిడెన్షియల్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల టౌన్ అర్బన్ రెసిడెన్షియల్(బాలుర) స్కూల్ ను ఇటీవల మల్యాల శివారులోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలోకి తరలించారు. ఇక్కడ స్కూల్ ను రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇద్దరు 6 వ తరగతి స్టూడెంట్స్ పరార్ అయ్యారు. ఊర్లోకి వెళ్లగానే కొందరు యువకులు చూసి ప్రశ్నించారు. వెంటనే స్కూల్ కు సమాచారం అందించగా వాచ్ మెన్ రజాక్ వెళ్లి స్టూడెంట్స్ ను తీసుకొచ్చాడని, మరుసటి రోజు తల్లిదండ్రులను పిలిపించి అప్పజెప్పినట్టు ఎస్ఓ తెలిపారు. అంతేకాకుండా స్కూల్ మొదట్లోనే 6 తరగతి విద్యార్థి పాఠశాల నుంచి పరార్ కాగా, బుధవారం పేరెంట్స్ వచ్చి మళ్లీ చేర్చుకోవాలని ఎస్ఓకు విజ్ఞప్తి చేశారు. కాగా.. బిల్డింగ్ కు ప్రహరీ, పెద్ద గేట్ తో పాటు కింద హాస్టల్ లో వార్డెన్, వాచ్ మెట్ అందుబాటులో ఉంటారు.
స్కూల్లో కూడా వాచ్ మెన్ తో పాటు షిఫ్ట్ లో రోజుకో టీచర్ అందుబాటులో ఉంటారు. అయినా స్టూడెంట్స్ పారిపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఉన్నతాధికా రులు స్పందించి, స్టూడెంట్స్ పరారీపై విచారణ చేయించాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. తాటిపల్లి బాలికల గురుకుల స్కూల్ లో 6 తరగతి విద్యార్థిని కూడా చెప్పకుండా వెళ్లడంతో టీసీ ఇచ్చినట్లు తెలిసింది.
అన్నీ నేలపైనే...
మల్యాల గురుకుల స్కూల్ లో 62 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నేలపైనే క్లాసులు నిర్వహిస్తున్నారు. బెడ్స్ లేకపోవడంతో నేలపైనే పడుకుంటు న్నారు. డైనింగ్ హాల్ లో నేలపైన కూర్చుని భోజనం చేస్తున్నట్లు స్టూడెంట్స్ తెలిపారు.