ఎంబీబీఎస్​ కౌన్సెలింగ్​కు బ్రేక్.​!

ఎంబీబీఎస్​ కౌన్సెలింగ్​కు బ్రేక్.​!
  •     3 వారాల క్రితమే ముగిసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ
  •     ఇప్పటికీ కౌన్సెలింగ్​ నోటిఫికేషన్​ ఇవ్వని హెల్త్​ వర్సిటీ
  •     రిజర్వేషన్ల అమలులో పోయినేడాది తప్పులు
  •     ఈసారి ముందే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన బీసీ సంఘాలు
  •     జీవోలో మార్పు చేయించే యోచనలో ఆరోగ్యశాఖ

హైదరాబాద్​, వెలుగు: ఎంబీబీఎస్​ అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఈ నెల 8వ తేదీ నాటికే రిజిస్ర్టేషన్ల ప్రక్రియ పూర్తయినా, ఇప్పటికీ కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ కౌన్సెలింగ్​ నోటిఫికేషన్​ ఇవ్వలేదు. రిజిస్ర్టేషన్​ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్​ ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఇవ్వకపోవడంపై వర్సిటీ నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. మరోవైపు డిసెంబర్​ 15 నుంచి క్లాసులు ప్రారంభించాలని నేషనల్​ మెడికల్​ కమిషన్​ సూచించింది. దీంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిరుడు కౌన్సెలింగ్​లో జరిగిన రిజర్వేషన్ల తప్పులే ఇప్పుడూ జరిగాయని, అందుకే కౌన్సెలింగ్​ లేట్​అవ్వడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లలో పొరపాట్ల వల్ల తమ పిల్లలు సీట్లు కోల్పోయారని కొంతమంది తల్లిదండ్రులు కోర్టులో కేసు వేసినా లాభం లేకుండాపోయింది. దీనిపై బీసీ సంఘాలు, స్టూడెంట్​ యూనియన్ల ప్రతినిధులు హెల్త్​ మినిస్టర్​‌‌‌‌‌‌‌‌ ఈటల రాజేందర్​‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్​ ఎంక్వైరీ చేయించగా, పదుల సంఖ్యలో రిజర్వ్​డ్​ సీట్లను ఓపెన్​ కేటగిరీ స్టూడెంట్లకు కేటాయించినట్టు తేలింది. కానీ, అప్పటికే కౌన్సెలింగ్​ దాదాపు అయిపోవడంతో అందరూ ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. హెల్త్​ వర్సిటీ అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయించామని చెబుతూ వచ్చారు.

జీవోలో మార్పు!

మెరిటోరియస్​ రిజర్వ్​డ్​ స్టూడెంట్లు తమకు వచ్చిన ఓపెన్​ కేటగిరీ సీటును వదులుకుని, వేరే కాలేజీలోని రిజర్వ్​డ్​ సీటును తీసుకోవచ్చు. దీన్నే సీట్​ స్లైడింగ్​ అంటారు. ఈ స్లైడింగ్​తో ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయడం దగ్గరే పొరపాట్లు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఆ పొరపాటు జరగకుండా రిజర్వేషన్ల అమలుకు కమిటీని నియమించాలని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్​.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్​గౌడ్​ వంటి నాయకులు ఈటలతో పాటు, ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీని కలిసి సీట్ల కేటాయింపులో జరుగుతున్న పొరపాట్లను వివరించారు. ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్​ వాయిదా పడినట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన పొరపాట్లను మంత్రి ఈటల, సెక్రటరీ రిజ్వీకి వివరించామని బీసీ సంఘం ప్రెసిడెంట్​ జాజుల శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. ఏపీలోనూ ఇదే విధంగా పొరపాట్లు జరిగితే అక్కడ ప్రభుత్వం జీవో 550, 111లను మారుస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణ కమిటీని కూడా నియమించింది. మన దగ్గర కూడా ఇదే విధంగా జీవోల్లో (550, 114) మార్పులు చేయించాలని ఆరోగ్యశాఖ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఈడబ్ల్యూఎస్​ సీట్ల కేటాయింపు విషయంలోనూ కొంత గందరగోళం నెలకొంది.