
'బిగ్ బాస్ సీజన్ 9' హౌస్‌లోకి ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్వహకులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే 'అగ్నిపరీక్ష'. మొత్తం 45 మంది ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు. ఈ పరీక్షలో నెగ్గిన ఐదుగురు అదృష్టవంతులు నేరుగా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' తొలి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా మొదలైంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు అభిజీత్, నవదీప్, బిందు మాధవి జడ్జిలుగా, శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి ఎపిసోడ్‌లోనే ఎంతోమంది ఆసక్తికరమైన కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి, గంగవ్వ వయసున్న నల్లగొండకు చెందిన కేతమ్మ.
ఆమె తలపై బోనం ఎత్తుకుని ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. తన జీవిత ప్రయాణాన్ని వివరించింది. నల్లగొండ దగ్గర తొండ తిరుమలగిరి తన ఊరని చెపుతూనే.. అన్ని కష్టపడ్డా, నా చిన్న బిడ్డ నన్ను, నాభర్తను సాకుతది . నాభర్తకు పక్షవాతం వచ్చింటూ ఎమోషనల్ అయింది. ఈ జన్మకి నాకు ఇంతే చాలు.. ఈ మిమ్మల్ని అందర్నీ కలవడం చాలా సంతోషంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కేతమ్మ మాటల్లోని నిజాయితీ, ఆమె ముఖంలో కనిపించిన ఆనందం జడ్జిలను, ప్రేక్షకులను కదిలించింది. తనలాంటి వృద్ధురాలికి ఈ అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని, బిగ్ బాస్ వేదికపైకి రావడం ఒక కలలా ఉందని ఆమె భావోద్వేగంతో చెప్పింది.
అయితే, ఇక్కడే కేతమ్మకు ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది. జడ్జిగా ఉన్న అభిజీత్, అవ్వా మీ జీవితంలో చూసినంత కష్టం నేను చూడలేదమ్మా. కానీ బిగ్ బాస్ ఆట చాలా కఠినంగా ఉంటుంది. మీకు అది చాలా కష్టం అవుతుందవ్వా అని ఆమెకు హితవు పలికాడు. దానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కేతమ్మ, నాకు తోచినంత ఆడతా. మీరు 10 మందిని కొట్టుకొస్తే, నేను ఒక్కళ్లనైనా కొట్టుకొస్తా అని చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అభిజిత్ ఆమెకు గ్రీన్ కార్డు ఇచ్చారు.
మరో జడ్జి నవదీప్ మాట్లాడుతూ, గతంలో గంగవ్వ కూడా హౌస్‌లోకి వచ్చి ఇదే మాట చెప్పింది. కానీ ఆమె అక్కడ ఉండలేకపోయింది. అనారోగ్యం, కుటుంబం గుర్తుకురావడం వంటి కారణాలతో బయటకు వెళ్ళిపోయింది. మీరు కూడా అలానే ఉంటారని అనిపిస్తోందని నవదీప్ అన్నారు. అటు బిందు మాధవి కూడా బిగ్ బాస్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పాడు. చివరికి ఈ ఇద్దరు జడ్జిలు కేతమ్మకు 'రెడ్ కార్డ్' ఇచ్చారు. అభిజీత్ గ్రీన్ కార్డుతో కేతమ్మ హోల్డ్ లోకి వెళ్లింది..
ఇక ఈ కార్యక్రమం ప్రసార సమయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఎప్పుడూ రాత్రి 9 లేదా 9:30 గంటలకు వచ్చే బిగ్ బాస్ ఎపిసోడ్‌లు, ఈసారి మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు జియో సినిమా ఓటీటీలో అప్‌లోడ్ అవుతున్నాయి. ఇదెక్కడి సమయం అంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ వంటి పెద్ద కార్యక్రమానికి సరైన సమయం కేటాయించకుండా అర్ధరాత్రి అప్‌లోడ్ చేయడం వల్ల అది ప్రేక్షకుల నుంచి దూరం అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.