యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • మేం కేవలం సరఫరా చేస్తం: తుమ్మల
  • అంతర్జాతీయ పరిస్థితులతోనే సమస్య
  • ఇంత పెద్ద దేశానికి యూరియా 
  • కావాలంటే చైనానే దిక్కు 
  • ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కొరత ఉన్నది   
  • రాజకీయ దురుద్దేశంతో 
  • మాపై బురదజల్లుతున్నరు  
  • లెక్కలన్నీ పక్కాగా ఉన్నయ్.. 
  • బీజేపీకి చర్చించే దమ్ముందా? 
  • వీ6  వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి 


హైదరాబాద్, వెలుగు: దేశమంతటికీ యూరియా ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్రాల బాధ్యత కేవలం రైతులకు సరఫరా చేయడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘‘అంతర్జాతీయంగా తలెత్తిన  పరిస్థితుల కారణంగానే యూరియా దిగుమతులపై ప్రభావం పడింది. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్య తలెత్తింది. 

ఇంతపెద్ద దేశం యూరియా కోసం చైనా వైపు చూడాల్సిన దుస్థితి ఎందుకు ఉందో కేంద్రం ఆలోచించాలి. ఏపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉన్నప్పటికీ.. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశంతో మాపై బురద జల్లుతున్నాయి. నెలవారీగా రాష్ట్రానికి సరఫరా అయిన యూరియా లెక్కలన్నీ నేను చెప్తాను. బీజేపీ నేతలకు చర్చకు వచ్చే దమ్ముందా?” అని సవాల్ విసిరారు. శనివారం వీ6 వెలుగుకు తుమ్మల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ప్రశ్న: యూరియా కొరత ఉందా? లేదా బ్లాక్ మార్కెట్‌‌లో ఉందా? అసలు సమస్య ఎక్కడుంది? 

తుమ్మల: తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. కానీ ఇప్పటి వరకు 5.30 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చింది. ఒక్క నెల కూడా పూర్తి కోటాను సప్లయ్‌‌ చేయలేదు. అంతర్జాతీయంగా సమస్యలతో దిగుమతులపై ప్రభావం పడడం, దేశీయంగా ఉత్పత్తి కూడా తగ్గడంతో యూరియా సమస్య ఏర్పడిందని కేంద్రమే ఒప్పుకున్నది. కానీ కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం మాకు ఎంత యూరియా ఇచ్చిందనేది, మేం రైతులకు ఎంత సరఫరా చేశామనేది అంతా ఆన్‌‌లైన్‌‌లో ఉంది.  

రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందా? యూరియా ఎక్కువ ఎందుకు వాడుతున్నారు?  

గతంలో వర్షాలను బట్టి కృష్ణా,  గోదావరి బేసిన్లకు వరదలు వచ్చేవి. కానీ ఈసారి ముందస్తు వర్షాలు రావడంతో పాటు రెండు బేసిన్లకు ఒకేసారి వరదలు వచ్చాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి పంటలు సాగు అయ్యాయి. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో యూరియా కావాల్సి వచ్చింది. అలాగే యూరియా అనుకున్న దానికంటే ఎక్కువ వాడుతున్నారు. యూరియా ధర కూడా తక్కువగా (రూ.266) ఉండి.. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా (రూ.1,600 నుంచి రూ.1,800) ఉండడంతో రైతులు ఎక్కువగా యూరియా వాడుతున్నారు. 

యూరియా వాడకం తగ్గించాలని చూసినా ఎందుకు తగ్గడం లేదు?

మనం చెప్పగానే జరగదు. రాష్ట్రంలో గత 20, 30 ఏండ్లుగా రైతులు యూరియా అత్యధికంగా వాడుతున్నారు. దాన్ని మెల్లగా తగ్గించుకుంటూ పోవాలి. సేంద్రియ సాగు, నానో యూరియాకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు.  

యూరియాను మంత్రులు బ్లాక్​చేస్తున్నారా?

అంత దౌర్భాగ్యం కలిగిన మంత్రులు ఈ కేబినెట్‌‌లో లేరు. రైతులకు అవసరమైన సమయంలో అలాంటి సన్నాసి పనులు చేసే మంత్రులు మా దగ్గర లేరు. ఆ అలవాటు, ఆ మార్గాలు గతంలో ఉన్నోళ్లకే తెలియాలి. 

ఈ నెలాఖరు నాటికి సమస్య పరిష్కారమవుతుందా?

ఈ నెలలో 68 వేల టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇంకో 20 వేల టన్నులు అడుగుతున్నాం. వారం పది రోజుల్లో 50 వేల టన్నులు వస్తే డిమాండ్‌‌ను తట్టుకుంటాం. మిగతాది సెప్టెంబర్ నెలలో సర్దుకుంటాం.

యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయా?  

రాజకీయంగా దివాళా తీసిన పార్టీలు చిల్లర పనులు చేస్తున్నాయి. యూరియా కోసం ఎక్కడైనా డీలర్ల దగ్గర క్యూ ఉందా? కేవలం ప్యాక్స్​దగ్గర ఎందుకు క్యూలు ఉంటున్నాయి. బీఆర్ఎస్​నాయకులు ఉన్న దగ్గరే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి? సమస్య లేదని మేం అనడం లేదు. సమస్యను పెద్దది చేసి, రైతుల చెప్పులు వీళ్లే తెచ్చి ఆందోళన చేస్తున్నారు.

యూరియా ఏ నెలలో ఎంత ఇచ్చారు?  

ఏప్రిల్‌‌లో ఇవ్వాల్సింది 1.70 లక్షల టన్నులైతే 1.21 లక్షలు టన్నులు మాత్రమే ఇచ్చారు. మేలో 1.60 లక్షల టన్నులకు గాను 88 వేల టన్నులు,  జూన్‌‌లో 1.70 లక్షల టన్నులకు గాను 98 వేల టన్నులు, జులైలో 1.60 లక్షల టన్నులకు గాను 1.43 లక్షల టన్నులు, ఆగస్టులో 1.70 లక్షల టన్నులకు గాను  లక్ష టన్నులు మాత్రమే ఇచ్చారు. మొత్తంలో కోటాలో సగమే ఇచ్చారు.