కీమోథెరపీ కోసం.. జిల్లాకో డే కేర్ క్యాన్సర్ సెంటర్

కీమోథెరపీ కోసం.. జిల్లాకో డే కేర్ క్యాన్సర్ సెంటర్
  • బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయం
  • ఒక్కో సెంటర్​లో 20 బెడ్లతో సౌలతులు 
  • క్యాన్సర్ పేషెంట్లకు తప్పనున్న కీమోథెరపీ కష్టాలు 

హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన కష్టాలు తప్పనున్నాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డే కేర్ క్యాన్సర్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో వీటిని ప్రారంభించాలని యోచిస్తున్నది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కీమోథెరపీ కోసం క్యాన్సర్ పేషెంట్లు హైదరాబాద్ దాకా రావాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి. ఇటీవల ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, అధికారులతో సమావేశమయ్యారు. క్యాన్సర్ నివారణ, చిక్సిత విషయంలో పలు సూచనలు చేశారు. నోరి దత్తాత్రేయుడు సూచనల మేరకే డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.  

20 బెడ్లతో డే కేర్ సెంటర్..  

క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా చికిత్సా కేంద్రాలు లేవు. దీంతో ఎంఎన్జే, నిమ్స్, బసవతాకరం వంటి ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది 55 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో 20 బెడ్లతో కూడిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.   

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లోని ఎంఎన్జే, నిమ్స్ మాదరిగా ఈ సెంటర్లు పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 20 బెడ్లలో10 కీమోథెరపీ కోసం, మరో ప10 బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం ఉపయోగించనున్నారు. కీమోథెరపీ బాధ్యతలను జనరల్ సర్జరీ డాక్టర్లకు, పాలియేటివ్ కేర్ బాధ్యతలను అనస్తీషియా డాక్టర్లకు అప్పగించనున్నారు.  

జిల్లాల్లోనే కీమోథెరపీ.. 

క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించేందుకు గాను అన్ని జిల్లా ప్రభుత్వ అసుపత్రులలో క్యాన్సర్ స్క్రీనింగ్ ను డే కేర్ క్యాన్సర్ సెంటర్లలోనే నిర్వహిస్తారు. లక్షణాలు కనిపిస్తే పేషెంట్లను హైదరాబాద్ లోని ఎంఎన్‌‌‌‌జే ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ కు రిఫర్ చేస్తారు. ఎంఎన్జేలో వ్యాధి నిర్ధారణ, ప్రాథమిక చికిత్స, మొదటి కీమోథెరపీ సెషన్‌‌‌‌ నిర్వహిస్తారు. 

ఆ తర్వాత పేషెంట్ ను సంబంధిత జిల్లాలోని డే కేర్ క్యాన్సర్ సెంటర్‌‌‌‌కు రిఫర్ చేస్తారు. రెండో దశ నుంచి కీమోథెరపీ చికిత్సను జిల్లా స్థాయిలోనే అందిస్తారు. దీంతో పేషెంట్లు ప్రతిసారీ హైదరాబాద్‌‌‌‌కు ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో పేషెంట్లకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, సమయం ఆదా అవుతుంది. దీర్ఘకాల చికిత్స పొందుతున్న రోగులకు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.