
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ పై ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. బ్యాంకులో మొత్తంగా రూ. 12 కోట్ల 61 లక్షల విలువైన బంగారం, కోటి 10 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 10 మంది అనుమానితుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు.
ఉన్నతాధికారుల సూచన మేరకు నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని బంగారం రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ దేవేందర్ చెప్పారు. ప్రధాన నిందితుడు బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.
మూడు నెలలకోసారి ఎస్ బీఐ ఉన్నతాధికారులు నిర్వహించే జనరల్ ఆడిటింగ్ ఆగస్టు 20 నుంచి చేపట్టగా బ్యాంకులో మోసం జరిగినట్టు గుర్తించారు. కస్టమర్లు లోన్ల కోసం కుదువ పెట్టిన బంగారాన్ని బ్యాంకు మేనేజర్, క్యాషియర్ కలిసి మాయం చేశారు. సమాచారం తెలియడంతో క్యాషియర్ నరిగే రవీందర్ తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని బ్యాంకు నుంచి వెళ్లిపోయాడు. మొదట రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు. అయితే రూ. 12 కోట్ల 61 లక్షల విలువైన బంగారం, కోటి 10 లక్షల నగదు పోయిందని ఇవాళ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సుమారు 449 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకోగా అందులో 402 మందికిపైగా గోల్డ్ మాయమైందని ఫిర్యాదు చేశారు.
10 మంది నిందితులు
నరిగే రవీందర్ : A1
కొంగండి బీరేష్: A2
నరిగే సరిత:A3
నరిగే స్వర్ణ లత అలియాస్ గోపు:A4
ఉమ్మల సురేష్:A5
కొదటి రాజశేఖర్:A6
గౌడ సుమన్:A7
ఎసంపల్లి సాయి కిరణ్:A8
ఎల్. సందీప్:A9
మోత్కూరి రమ్య: A10
చెన్నూర్ ఎస్‌బీఐలో బంగారం మాయమైన ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరా తీశారు. చెన్నూర్ లో మంత్రి స్థానిక క్యాంస్ ఆఫీస్ వద్ద ఏసీపీ వెంకటేశ్వర్లును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్టమర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.