ఒక్కసారి ఆ తీర్పు చదివి ఉంటే బాగుండేది: అమిత్ షాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కౌంటర్

ఒక్కసారి ఆ తీర్పు చదివి ఉంటే బాగుండేది: అమిత్ షాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కౌంటర్

న్యూఢిల్లీ: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి. సల్వాజుడం తీర్పు సుప్రీంకోర్టుదేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. ఆ తీర్పును తానే రాశా.. కానీ తీర్పు తన వ్యక్తిగతం కాదు. తీర్పు సుప్రీంకోర్టుదని అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 

ఈ తీర్పు వెలువరించే సమయంలో బెంచ్‎పై నాతో పాటు మరో న్యాయమూర్తి కూడా ఉన్నారని గుర్తు చేశారు జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి. అమిత్ షా తనపై ఆరోపణలు చేసే ముందు సల్వాజుడుం మొత్తం తీర్పును చదివి ఉంటే బాగుండేదని.. ఒకవేళ ఆయన తీర్పును చదివి ఉంటే బహుశా ఇలా మాట్లాడే వారు కాదని అన్నారు. ఏదైనా డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని స్పష్టం చేశారు. 

అమిత్ షా ఏమన్నారంటే..? 

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పోటీకి దిగడంతో ఆయనపై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని ఆరోపించారు అమిత్ షా. 2011లో సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వాజుడుంపై తీర్పు ఇచ్చారని.. ఆయన ఆ తీర్పు ఇచ్చి ఉండకపోతే 2020 నాటికే దేశంలో మావోయిస్టు తీవ్రవాదం ముగిసి ఉండేదన్నారు.

జస్టిస్‌ సుదర్శన్ రెడ్డి రెడ్డి నక్సల్‌ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారు కాబట్టే అలాంటి తీర్పు వెలువరించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు అమిత్ షా. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిపై అమిత్ షా ఇలాంటి ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అసలు సల్వాజుడుం తీర్పు ఏంటి అని పలువురు ఇంటర్ నెట్లో వెతుకుతున్నారు. 

సల్వాజుడుం తీర్పు ఏంటంటే..?

మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన యువకులతో సల్వా జుడుం అనే పేరుతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక దళాన్ని ఏర్పాటు చేసింది.  సల్వా జుడుంలోని గిరిజన యువకులు ఆయుధాలు ధరించి మావోయిస్టులతో పోరాటం చేశారు. సల్వా జుడుంకు వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం2011,  డిసెంబర్‎లో సల్వా జుడుం ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వెల్లడించింది. గిరిజన యువకులను నిరాయుధులను చేయాలని ఆదేశించింది. రాష్ట్రం పౌరులకు ఆయుధాలు ఇవ్వకూడదని, వారికి శాంతిభద్రతల విధులను అప్పగించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.