నేటి తరం న్యూ టెక్నాలజీ విప్లవానికి చాలా తగ్గరగా ఉంది. దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న టైపింగ్ సంస్కృతికి త్వరలోనే సమాధి కట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP సీఈఓ క్రిస్టియన్ క్లైన్. రాబోయే రెండు మూడు ఏళ్లలో కీబోర్డ్‌లు కనుమరుగవుతాయని, వాటి స్థానాన్ని ఏఐ బేస్డ్ వాయిస్ టెక్నాలజీ రాబోతోందని అన్నారు. 1714లో హెన్రీ మిల్ అనే ఇంజనీర్ టైప్‌రైటర్ కోసం మొదటి పేటెంట్ పొందిన నాటి నుంచి నేటి మోడ్రన్ కీబోర్డ్స్ వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం దాదాపు ముగింపు దశకు చేరుకుందని క్లైన్ చెబుతున్నారు.
మాటతోనే మ్యాజిక్.. ఇక టైపింగ్ ఎందుకు?
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధి చెందడంతో వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ అద్భుతమైన స్థాయికి చేరుకుందని క్లైన్ అంచనా వేస్తు్న్నారు. గతంలో వాయిస్ కమాండ్స్ ఇచ్చినా కంప్యూటర్లు సరిగ్గా అర్థం చేసుకునేవి కావు. కానీ ఇప్పుడు ఏఐ మన మాటలోని భావాన్ని, బిజినెస్ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నాయని ఆయన అంటున్నారు. ఇకపై ఆఫీసుల్లో కూర్చుని డేటాను ఎంటర్ చేయడానికి గంటల తరబడి కీబోర్డ్‌పై వేళ్లు ఆడించాల్సిన అవసరం లేదు. "గత నెల బిజినెస్ రిపోర్ట్ తయారు చెయ్", "ఇన్వెంటరీలో మార్పులు చేయి" అని నోటితో చెబితే చాలు.. ఏఐ దానంతట అదే పని పూర్తి చేసేస్తుందని చెప్పారు క్లైన్.
కేవలం టైపింగ్ తగ్గడమే కాదు.. ఏఐ వల్ల బిజినెస్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా మారిపోనుంది. సాధారణంగా ఒక పెద్ద కంపెనీలో కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్టాక్‌ను సర్దుబాటు చేయడానికి నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఏఐ ఏజెంట్లు మనుషుల కంటే వేగంగా డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయని క్రిస్టియన్ క్లైన్ ఉదహరించారు. దీనివల్ల ఇన్వెంటరీ ఖర్చులు 20 శాతం వరకు తగ్గుతున్నాయని.. ఇది కేవలం ఏదో ఒక విభాగంలో కాకుండా, కంపెనీ మొత్తం మీద ఒకేసారి ప్రభావం చూపుతోందన్నారు. లక్షలాది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను ఏఐ క్షణాల్లో విశ్లేషించి, కంపెనీ లాభాల కోసం ఏం చేయాలో సలహాలు కూడా ఇస్తోందని వాస్తవ పరిస్థితులు వేగంగా వస్తున్న ఏఐ మార్పుల గురించి వెల్లడించారు.
►ALSO READ | మరో 20 వేలు తగ్గింది.. ఇప్పుడు మీ దగ్గర షాపుల్లో కిలో వెండి 3 లక్షలే..
సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతున్నా.. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఒక సవాలుగా మారాయని క్లైన్ పేర్కొన్నారు. వివిధ దేశాల్లో ఉన్న డేటా భద్రతా చట్టాలు, శాంక్షన్స్ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఆయా దేశాల్లోనే ఉంచాల్సి వస్తోంది. ముఖ్యంగా యూరప్ వంటి దేశాలు రెగ్యులేషన్స్ పెట్టడంలో ఉన్న శ్రద్ధ, ఆవిష్కరణలపై పెట్టడం లేదని ఆయన చురకలు అంటించారు. ఏది ఏమైనా టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు చర్చంతా 'ఎగ్జిక్యూషన్' పైనే ఉంది.
కీబోర్డ్ ఒకప్పుడు విప్లవాత్మక ఆవిష్కరణ. కానీ ఏఐ యుగంలో అది ఒక బరువుగా మారుతోంది. చేతి వేళ్లతో టైప్ చేసే శ్రమ తప్పి, కేవలం మన ఆలోచనలను మాటల రూపంలో చెబితే పనులు జరిగిపోయే అద్భుతమైన భవిష్యత్తు వైపు మనుషులు అడుగులు వేస్తున్నాం. కీబోర్డ్‌ల శకం ముగిసి 'వాయిస్-ఫస్ట్' యుగం మొదలవుతోందని క్లైన్ చెబుతున్నారు. ఇది గంటల తరబడి చేయాల్సిన పనులను నిమిషాలకు తగ్గిస్తుందని, అలాగే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్లుగా పనులు మాటల వేగంతో పూర్తవుతాయని అన్నారు.
