జనవరి నెల ప్రారంభం నుంచి రంకెలు వేస్తూ దూసుకుపోయిన వెండి, బంగారం రేట్ల ర్యాలీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. బడ్జెట్ ప్రకటనకు ముందే భారీగా వెండి రేట్లు పతనం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అనూహ్యం నిర్ణయాలు ఒక్కసారిగా విలువైన లోహాల ర్యాలీకి బ్రేక్స్ వేశాయి. ప్రధానంగా స్పాట్ మార్కెట్లతో పాటు ఫ్యూచర్స్ మార్కెట్లు, ఈటీఎఫ్స్ రేట్లలో భారీ పతనం కారణంగా రిటైల్ షాపుల్లో రేట్లు కూడా దానికి అనుగుణంగానే తగ్గుతూపోతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఫిబ్రవరి 1న కేజీ వెండి రేటు రూ.3లక్షల 20వేల వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇది సోమవారం కేజీకి రూ.20వేల మేర తగ్గటంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోని రిటైల్ వెండి దుకాణాల్లో రేటు రూ.3 లక్షలకు దిగొచ్చింది. అయితే ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లలోని పరిస్థితులు చూస్తుంటే రానున్న కాలంలో బంగారం, వెండి రేట్లు మరింతగా దిగిరానున్నట్లు నిపుణులు అంటున్నారు.
ALSO READ : బడ్జెట్ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఢమాల్..
కుప్పకూలిన ఈటీఎఫ్స్, మార్చి ఫ్యూచర్స్..
స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ సోమవారం 3 శాతం పడిపోవటంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.లక్షా 43వేల 335గా ఉంది. అలాగా జూన్, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4 శాతం వరకూ తగ్గాయి. ఇదే క్రమంలో వెండి ఫ్యూచర్స్ విషయానికి వస్తే మార్చి ఎక్స్ పెయిరీ ఉన్న వాటి రేటు 6 శాతం తగ్గి కేజీ వెండి రూ.2లక్షల 49వేల 713 పలుకుతోంది. ఇది గత గురవారంతో పోల్చితే ఏకంగా 41 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
ALSO READ : స్టార్ లింక్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్
ఇదే క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సిల్వర్, ఐసీఐసీఐ సిల్వర్, ఎస్బీఐ సిల్వర్, టాటా సిల్వర్, యాక్సిస్ సిల్వర్, కోటక్ సిల్వర్ ఈటీఎఫ్స్ 20 శాతం వరకూ క్రాష్ కావటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఇదంతా చూస్తుంటే సిల్వర్ కి దక్కిన ఓవర్ హైప్ ఇక అయిపోయిందా అనే అనుమానాలు ఇన్వెస్టర్లలో వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో చాలా గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా 10 శాతం వరకూ రేట్ల పతనాన్ని ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో నమోదు చేశాయి.
