
- బిడ్డ డెడ్ బాడీతో కలెక్టరేట్‌కు తండ్రి
- డాక్టర్లపై ఫిర్యాదు.. ఆస్పత్రి సీజ్
- ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ప్రసవం లేట్ చేయడంతో పుట్టిన వెంటనే శిశువు మరణించింది. కడుపుకోతను తట్టుకోలేకపోయిన తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని నేరుగా జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు వెంటనే ఆస్పత్రిని సీజ్ చేశారు.
వివరాళ్లోకి వెళితే.. విపిన్ గుప్తా అనే వ్యక్తి గురువారం తన భార్యను ప్రసవం కోసం స్థానికంగా ఉన్న గోల్డార్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. నార్మల్ డెలివరీకి రూ.10 వేలు సీ-సెక్షన్‌కు రూ. 12 వేలు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది మొదట చెప్పారు. కానీ, అతని భార్యకు పురుటి నొప్పులు పెరుగుతుంటే ఆస్పత్రి సిబ్బంది డెలివరీ చార్జీలు పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు విపిన్ గుప్తా కొంత డబ్బు కట్టినా వారు ఇంకా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేశారు.
డబ్బు మొత్తం చెల్లిస్తేనే డెలివరీ చేస్తామని తేల్చిచెప్పారు.డెలివరీ చేయకపోతే తన భార్యను వేరే ఆస్పత్రికైనా తరలించాలని వేడుకున్నాడు. అయినా, డెలివరీ ప్రాసెస్ ప్రారంభించామని.. డబ్బు మొత్తం కట్టాల్సిందేనని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. దాంతో చేసేదిలేక విపిన్ గుప్తా ఆస్పత్రి వాళ్లు అడిగినంతా కట్టేశాడు. కానీ అప్పటికే ప్రసవం ఆలస్యం అవడంతో బిడ్డ చనిపోయింది. దాంతో విపిన్ కన్నీటిపర్యంతమయ్యాడు. న్యాయం కోసం తన బిడ్డ మృతదేహాన్ని తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు.
ఆస్పత్రి సీజ్.. కేసు నమోదు
ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టింది. గోల్డార్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.