
- స్మార్ట్ ఫోన్ల ప్రభావం..దారి తప్పుతున్న బాల్యం!
- పిల్లలపై ఓటీటీ వెబ్‌సిరీస్‌లు, స్మార్ట్‌ఫోన్ల ప్రభావం
- స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లు
- మత్తుపదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్లుగా అవతారం
- ఈ ఏడాది ఇప్పటికే 50 మందికి పైగా పట్టుబడ్డ మైనర్లు
- పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిపెట్టకపోవడమే ప్రధాన కారణం
హైదరాబాద్, వెలుగు: తెలిసీ తెలియని వయస్సు.. మంచి, చెడులను విడమరిచి చెప్పేవారు లేరు. తప్పు చేస్తే దండించే వారూ లేరు. సోషల్ మీడియా, వెబ్ సిరీస్‌లు చూస్తూ పెరుగుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులతో కత్తులు పడుతున్నారు. తమకు నచ్చింది దక్కించుకునేందుకు హత్యలకు సైతం వెనుకాడడం లేదు.
స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు ఇందుకు ఆజ్యం పోస్తుండగా.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం పిల్లల బాల్యాన్ని గతి తప్పేలా చేస్తున్నది. చిన్న వయసులోనే సిగరెట్లు, లిక్కర్, డ్రగ్స్‌కు బానిసలుగా చేసి క్రిమినల్స్‌గా మారుస్తున్నది. అశ్లీల చిత్రాలకు సైతం మైనర్లు బానిసలుగా మారుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబాలు గడవడం లేదు. ఉపాధి, ఉద్యోగాల్లో బిజీగా ఉండే పేరెంట్స్ ఇంటికి రాగానే టీవీలకో, ఫోన్లకో అతుక్కుపోతున్నారు. పిల్లల కోసం పట్టుమని గంట సమయం కూడా కేటాయించడం లేదు. స్కూల్లో రోజు ఎలా గడిచిందో, ఉపాధ్యాయులు ఏమి చెప్పారో, స్నేహితులు ఎలా ప్రవర్తించారో తెలుసుకునే తీరిక లేదు.
పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పడం లేదు. ఈ క్రమంలో కుటుంబ బంధాలు, అనుబంధాలు పలుచబడుతున్నాయి. తల్లిదండ్రుల పట్టింపులేమితో పిల్లలు ఓ వయస్సు రాగానే స్కూళ్లలో చెడు స్నేహాలకు అలవాటు పడ్తున్నారు. కొందరు సిగరెట్లతో మొదలై గాంజా దాకా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. 15 ఏండ్లు ఆపై బడినవాళ్లు డ్రగ్స్‌కు అలవాటుపడ్తున్నారు.
ఇలా మత్తుపదార్థాలకు బానిసలై, చేతిలో డబ్బులేని స్థితిని ఆసరాగా చేసుకుంటున్న స్మగ్లర్లు మైనర్లతో గంజాయి, డ్రగ్స్ రవాణా చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు50 మందికి పైగా మైనర్లు గాంజా, డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కూల్, కాలేజీలకు వెళ్తున్న తమ పిల్లల ప్రవర్తనపై దృష్టిపెట్టని పేరెంట్స్ వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరమైన సమస్యలు, మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య తలెత్తే వివాదాలు, ఇతరత్రా అంశాలు సైతం పిల్లలను పెడదారి పట్టిస్తున్నాయని మానసిక నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
పిల్లల్లో విపరీత ప్రవర్తన..
పిల్లల్లో విపరీత ప్రవర్తనకు స్మార్ట్ ఫోన్ వినియోగం, ఓటీటీ వెబ్‌సిరీస్‌లు ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. చిన్న వయస్సులోనే క్రైం, అడల్ట్కంటెంట్ ప్రభావం వల్ల పిల్లల్లో హల్యూసినేషన్‌కు దారితీస్తున్నదని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. కావాలనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలనే కసి, కోపం పిల్లల పెరిగిపోతున్నాయని దీనివల్లే ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు.
‘సెపియన్ ల్యాబ్స్’ అనే సంస్థ మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న పిల్లలపై అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ‘ది యంగ్ మైండ్: రైజింగ్ అగ్రెషన్, యాంగర్’ పేరిట మన దేశంలోని 10వేల మంది పిల్లలపై చేసిన ఆ స్టడీ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో సగటున 11 ఏండ్ల వయసు నుంచే పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు.
ఫోన్ వినియోగం వల్ల ప్రధానంగా13 నుంచి 17 ఏండ్ల వయసున్న టీనేజ్ పిల్లల్లో బాధ, కోపం, గిల్ట్, భయంలాంటి విపరీత పోకడలు కనిపించాయి. మొత్తం మీద 46 శాతం మంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని, 37 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఫోన్ వాడుతున్న వాళ్లలో చాలా వరకు నేర్చుకునే తత్వాన్నీ కోల్పోతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
బాల్యాన్ని ఛిద్రం చేస్తున్న ఓటీటీ
ఒకప్పుడు సందేశాత్మక, కుటుంబ కథా చిత్రాలు యువత భవిష్యత్తుకు బాటలు వేసేవి . కానీ ప్రస్తుతం ఓటీటీ, సోషల్‌మీడియా అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో హత్యలు, అత్యాచారాలు ఎట్లా చేయాలో, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఎట్లా తప్పించుకోవాలో చూపిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక సన్నివేశాలతోపాటు అశ్లీల దృశ్యాలను చూస్తూ తల్లిదండ్రులు స్క్రీన్‌లకు అతుక్కుపోతారని, కానీ వాటిని చూసే పిల్లల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా నమోదవుతున్న సంచలనాత్మక కేసుల వెనుక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని మానసిక వైద్య నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఓటీటీలో వచ్చే హింసాత్మక సినిమాలు, సిరీస్‌లు చూడటం వల్ల పిల్లల్లో అగ్రెసివ్ బిహేవియర్, కోపం, హింసాత్మక ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించారు.
ముఖ్యంగా కౌమారంలో ఉన్న యువతపై సెక్సువల్ కంటెంట్ నెగెటివ్ సైకాలజికల్ ఇంపాక్ట్ చూపుతున్నదని తేల్చారు. తల్లిదండ్రుల్లో మార్పు వస్తే తప్ప పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయలేమని మానసిక నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అలాగే, ఉపాధ్యాయులు సైతం సిలబస్వెంట పరుగెత్తకుండా వారంలో ఒకరోజు పుస్తకాలు పక్కనపెట్టి నైతిక విలువలు బోధించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు విద్యావేత్తలు సైతం కరిక్యులంలోనూ మార్పులు చేయాలని సలహా ఇస్తున్నారు.
ఓటీటీ వెబ్ సిరీస్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ చూశాడు. నేరం ఎలా చేస్తారు.. ఎలా తప్పించుకోవాలనేది గమనించాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం స్కెచ్ వేశాడు. ఎప్పుడు చోరీ చేయాలి, ఇంట్లోకి ఎలా వెళ్లాలి, అడ్డుకున్నవారిపై ఎలా దాడి చేయాలి, ఎలా తప్పించుకోవాలనేది గ్రాఫ్ చేసుకున్నాడు. సినిమాల్లో చూపించే విధంగా బిల్డింగులపై నుంచి దూకి ఇంట్లోకి ప్రవేశించాడు.
అడ్డుకున్న బాలికపై కత్తితో 20 సార్లు దాడి చేసి, హతమార్చాడు. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసులో మైనర్ బాలుడు క్రైమ్ వెబ్‌సిరీస్‌తో ప్రేరణ పొందినట్లు పోలీసులు గుర్తించారు.
కుషాయిగూడలోని ఓ హార్డ్వేర్షాప్లో పని చేస్తున్న మైనర్(17)..తనను తరుచూ విసిగిస్తున్నదని ఓనర్ కమలాదేవి (60)పై కక్ష పెంచుకున్నాడు. ఓ ఓటీటీ వెబ్‌సిరీస్‌లో చూపిన విధంగా హత్యకు స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలైన ఓనర్ తలపై రాడ్‌తో కొట్టి చంపాడు. కొద్దిసేపు ఆమె డెడ్‌బాడీపై డ్యాన్స్‌చేశాడు. తన పగ చల్లారిందన్న తరహాలో సెల్ఫీ వీడియో తీసి మృతురాలి బంధువులకు షేర్చేశాడు. పోలీసులు ఆ మైనర్‌ను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.
నైతిక విలువలు బోధించాలి
మైనర్లు మంచి కంటే చెడునే ఎక్కువగా స్వీకరిస్తుంటారు. తమంతట తాము హింసాత్మక ఘటనలకు పాల్పడరు. నచ్చింది సొంతం చేసుకోవాలని చూస్తారు. విద్యార్థుల మధ్య పోటీ కూడా ప్రభావం చూపుతుంది. ఒకరి ప్రేరణతోనో లేక చూడడం వల్లనో వారిలో మానసికంగా మార్పులు వస్తాయి. ఇందుకు ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు ఆజ్యం పోస్తున్నాయి.
ఇంట్లో తల్లిదండ్రులు ప్రవర్తించే విధానం కూడా పిల్లలపై ఇంపాక్ట్ చూపుతుంది. పిల్లలకు పేరెంట్స్ టైం కేటాయించడంతోపాటు మంచేదో, చెడోదో చెప్పుకుంటూ పెంచాలి. నైతిక విలువలను కరిక్యులంలో భాగం చేసి, ఉపాధ్యాయుల ద్వారా నైతిక విలువలు బోధించాలి.
- డాక్టర్ హరిణి, మానసిక వైద్యురాలు, హైదరాబాద్