
- ఏది ఏమైనా రాహుల్ మాట నిలబెడ్తం.. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోతం
- పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, బీసీలకు ఆ చట్టమే శాపంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ అడ్డంకిని తొలగించడానికి తాము ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్‌కు పంపిస్తే.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించిన రెండు బీసీ బిల్లులతో పాటు ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని.. అవి పెండింగ్‌లో ఉండటంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.
ఏది ఏమైనా రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని సీఎం పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, అడ్వయిజరీ కమిటీ సంయుక్త సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేతలు కేకే, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచార లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ వాసి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేసింది. అనంతరం పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, దాన్ని కేంద్రానికి గవర్నర్ పంపారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు పెరగవని ఆయన అన్నారు.
90 రోజుల్లో బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించినట్లు చెప్పారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లుల అంశం ప్రస్తావనకు వస్తుందని.. దీనిపై విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుందన్నారు. ‘‘బీసీలకు మేలు జరగాల్సిందే. రాహుల్ మాట నిలబెట్టాల్సిందే. రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. బీసీ లకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్లు తీసుకొచ్చాం” అని గుర్తుచేశారు. బిహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘ఓట్ చోరీ’ వ్యతిరేక పాదయాత్రకు ఈ నెల 26న తాను హాజరవుతున్నట్లు సీఎం చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తం: మహేశ్ గౌడ్
లోకల్ బాడీ ఎన్నికలను, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నదని... రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం లాంటి కార్యక్రమాలకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు.
పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి విడత పాదయాత్రకు జనం నుంచి మంచి ఆదరణ లభించిందని.. యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన పేర్కొన్నారు. యూరియా పేరిట బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ఓట్ చోరీ పెద్దఎత్తున జరిగిందని, ఓట్ చోరీతోనే మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
ఈ విషయంలో రాహుల్ గాంధీ సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి ప్రజల్లో ఉద్యమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. దీన్ని రాష్ట్రంలో విస్తృతంగా తీసుకెళ్లి, ప్రజల్లో ‘ఓట్ చోరీ’ అంశంపై చర్చ జరిగేలా చూడాలని సూచించారు. వీటన్నింటిపై చర్చించి ఒక ప్రణాళికతో ముందుకుపోదామని పార్టీ నేతలతో ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన 45 ఏండ్ల రాజకీయ ప్రస్తానంపై రాసిన ‘లయాల్టీ అండ్ లెగసీ’ పుస్తకాన్ని పీఏసీ మీటింగ్ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
పీఏసీ మీటింగ్‌కు ముందు సీఎం ఇంట్లో భేటీ
పీఏసీ సమావేశానికి ముందు పీసీసీ కోర్ కమిటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ ఇంట్లో భేటీ అయింది. ఇందులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాపై ఇందులో విస్తృతంగా చర్చించారు.
లోకల్ బాడీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ముందుకు వెళ్లడం ఎలా అనే దానిపై డిస్కస్ చేశారు. అదేవిధంగా.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం, రాష్ట్రంలో యూరియా కొరత, రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ వ్యతిరేక పోరాటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు.
యూరియాపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు
బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థం అవుతుందని ఆయన అన్నారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ను కలిశానని చెప్పారు.
యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ ను పెంచాలని, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారని తెలిపారు.