ధర్మస్థల హత్యలు.. కట్టుకథే

ధర్మస్థల హత్యలు.. కట్టుకథే
  • ఫిర్యాదుదారు చెన్నాను అరెస్టు చేసిన సిట్  

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాలను బొందపెట్టానంటూ ఒక్కప్పుడు ఇక్కడ పారిశుధ్య కార్మికుడిగా పని చేసిన సీఎన్‌‌ చిన్నయ్య అలియాస్ చెన్నా చెప్పిందంతా కట్టుకథేనని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తేల్చింది. చెన్నా చెప్పిన ప్రకారం ఆధారాలేవీ దొరక్కపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు అతణ్ని ప్రశ్నించి అదంతా అబద్ధమని నిర్ధారించింది. 

ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన చెన్నాను శనివారం అరెస్టు చేసింది. అతణ్ని కోర్టులో హాజరుపరచగా, 10 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఆరోపణలు చేసిన సుజాత భట్ అనే మహిళ యూటర్న్ తీసుకుంది. ఎంబీబీఎస్ చదివే తన బిడ్డ అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆరోపించిన ఆమె.. అదంతా కట్టుకథేనని ఒప్పుకుంది. తనకు అనన్య అనే కూతురే లేదని చెప్పింది. కొంతమంది తనను బలవంతం చేసి అలా చెప్పించారని తెలిపింది.  

అసలేంటీ కేసు? 

దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ 1995 నుంచి 2014 వరకు చెన్నా పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఆ టైమ్‌‌లో అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని.. వాళ్ల మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఆ డెడ్‌‌బాడీలన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైనోళ్లవని, వాళ్లు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నాయని చెప్పాడు. 

దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. చెన్నా చెప్పిన చోట్ల అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే, రెండు చోట్ల మాత్రమే మానవ అవశేషాలు బయటపడ్డాయి.