ఏపీలో కొత్త కేసుల పెరుగుదలకు బ్రేక్

ఏపీలో కొత్త కేసుల పెరుగుదలకు బ్రేక్
  • ఇవాళ 14 వేల 986 కేసులు నమోదు.. 84 మంది మృతి

అమరావతి: ఏపీలో గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ బెంబేలెత్తించిన కరోనా కేసులు గడచిన 24 గంటల్లో చాలా తగ్గాయి. గడచిన వారం రోజుల్లో దాదాపు ప్రతిరోజు 20వేలకుపైగా కేసులు.. అంతే స్థాయిలో మరణాలు జరగడం అటు పాలకులనే కాదు కరోనా వారియర్స్ ను.. ఆందోళనకు గురిచేసింది. ప్రజలు సైతం ఏమవుతుందో.. ఏం జరగబోతోందోనన్న భయం వెంటాడింది.అయితే గడచిన 24 గంటల్లో భారీగా తగ్గిపోవడం ఊరట కలిగిస్తోంది. ఇది ఇవాళ ఒక్కరోజుకే పరిమితమా లేక అంతర్ రాష్ట్ర రవాణాను నిరోధించడం వల్లనేనా అన్నది తెలియాల్సి ఉంది. కరోనా ఆంక్షలు కట్టుదిట్టం చేస్తుండడం వల్లే కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్నా.. రోజులు గడిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
ప్రస్తుతానికి వస్తే గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 60 వేల 124 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14 వేల 986 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే 84 మంది కరోనాతో మృతి చెందారు. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో పది మంది, విశాఖపట్టణంలో 9 మంది, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరేసి కరోనాతో కోలుకోలేక చనిపోయారు. 
మరోవైపు గడచిన 24 గంటల్లో 16 వేల 167 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2352 మందికి కరోనా నిర్ధారణ కాగా.. అనంతపురం జిల్లో  639 మందికి, చిత్తూరులో 1543 మందికి, గుంటూరులో 1575 మందికి, కడప జిల్లాలో 1224 మందికి, కృష్ణా జిల్లాలో 666 మందికి, కర్నూలు జిల్లాలో 948 మందికి నెల్లూరు జిల్లాలో 1432 మందికి, ప్రకాశం జిల్లలో 639 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 1298 మందికి, విశాఖపట్టణం జిల్లాలో 1618 మందికి, విజయనగరం జిల్లాలో 629 మందికి పశ్చిమ గోదావరి జిల్లాలో 423 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య  ఒక కోటి 74 లక్షల 28 వేల 59కి చేరింది.