ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

తిమ్మాపూర్ లో పారిశుధ్య నిర్వహణ బాగుంది

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: తిమ్మాపూర్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ బాగుందని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్​బాబు అన్నారు. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలో ఘణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ- ఓడీఎఫ్ ప్లస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ బృందం సభ్యులు మండలం పరిధిలోని తిమ్మాపూర్ గ్రామాన్ని బుధవారం సందర్శించింది. స్వచ్ఛ  భారత్ మిషన్ కేంద్రం ట్రైనర్ లక్ష్మీకాంత్ షిండే గ్రామ ముఖచిత్రం గీసి పూర్తి అవగాహన కల్పించారు. ఏడు బృందాలు గ్రామంలో 350 కుటుంబాల వివరాలతో పాటు, ఓడీఎఫ్ పనితీరుపై సర్వే చేసి ప్రణాళిక తయారు చేశారు. ఈ సందర్భంగా సురేశ్​బాబు మాట్లాడుతూ గ్రామంలో ఓడీఎఫ్ పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఘణ, ద్రవ వ్యర్థాలను డంపుయార్డులో వేసి కంపోస్టు ఎరువులు తయారు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీరమేశ్, యునిసెఫ్ కో ఆర్డినేటర్ వెంకటేశం, ఐఈసీ కో ఆర్డినేటర్ శ్యాంకుమార్, డీఎల్ పీఓ వేధావతి, ఎస్ బీఎం జిల్లా కో ఆర్డినేటర్ సత్యనారాయణ, చెన్నారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వర రెడ్డి, భిక్షపతి, బృందం సభ్యులు సచ్చినంద్, సతీశ్, కార్యదర్శి వేణు పాల్గొన్నారు.

విజయానికి అంగవైకల్యం అడ్డుకాదు 

సంగారెడ్డి టౌన్​/మెదక్​టౌన్​/కంది, వెలుగు :  జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ రాజార్జి షా, మెదక్ అడిషనల్​ఎస్పీ డాక్టర్​ బాలస్వామి అన్నారు. డిసెంబర్​ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి అంబేద్కర్​స్టేడియం గ్రౌండ్ లో అడిషనల్​ కలెక్టర్, మెదక్​లోని ఇందిరా గాంధీ అవుట్  డోర్ స్టేడియంలో అడిషనల్​ఎస్పీ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి క్రీడాపోటీలు దోహదపడతాయన్నారు. ఎవరికీ తీసిపోని విధంగా దివ్యాంగులు అన్ని రకాల ఆటల పోటీలలో  ఉత్సాహంగా పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. జిల్లాలో నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన వారు హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పోటీలు జూనియర్, సీనియర్ కేటగిరిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పరుగు పందెం, షాట్ పుట్,  జావలిన్ త్రో, ట్రై సైకిల్ రేసు, క్యారం, చెస్ పోటీలు నిర్వహించారు. సంగారెడ్డిలో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెదక్​లో జిల్లా సంక్షేమాధికారి  బ్రహ్మాజీ,  జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు,  మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, సీడీపీవోలు హేమభార్గవి, స్వరూపరాణి, పీఈటీలు శ్రీనివాస్ రావు,మాధవ రెడ్డి, శ్రీధర్, మధు, తదితరులు  పాల్గొన్నారు.  

బీజేపీలో చేరిన భవన నిర్మాణ కార్మికులు 

దుబ్బాక, వెలుగు: దేశం కోసం, ధర్మం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీలో ప్రజలు చేరుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. బుధవారం అక్బర్​పేట- భూంపల్లి మండల కేంద్రానికి చెందిన 30 మంది భవన నిర్మాణ కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇశ్రామ్​ కార్డులను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని, పారదర్శకమైన పాలన అందిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగె కృష్ణ, సాయిలు, నర్సింలు, వెంకట్​ గౌడ్​ పాల్గొన్నారు. 

దుబ్బాకపై మంత్రి వివక్ష తగదు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గంపై మంత్రి హరీశ్​రావు వివక్ష చూపడం తగదని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఎమ్మెల్యే అనుమతి లేకుండానే నిధులను ఖర్చు చేయడంపై సీఎం కేసీఆర్​కు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని చెప్పుకుంటున్న సీఎం ​ ప్రతి పక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఎందుకింత వివక్ష చూపుతుందో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గంలో నిధుల కేటాయింపులో ఎమ్మెల్యేకు హక్కు లేకుండా మంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమే కాకుండా అగౌరవ పరుస్తూ, వివక్ష చూపిస్తూ దుబ్బాక ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వివరించారు.

స్కానింగ్‌‌‌‌పై అవగాహన  

మెదక్ టౌన్, వెలుగు:  గర్భంలోని పిండం ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే  గుర్తించేందుకు స్కానింగ్​ దోహదపడుతుందని  ప్రముఖ డాక్టర్ చిన్మయి రాధ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలో మెదక్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ శివదయాల్, జనరల్​ సెక్రటరీ డాక్టర్​ విజయ్​కుమార్, కోశాధికారి డాక్టర్​ పెంటాగౌడ్,  ప్రముఖ వైద్యులు  డాక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో  ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఆకారం, అంగవైకల్యం, జన్యు పరమైన సమస్యలను  స్కానింగ్ ద్వారా గుర్తించడంపై పట్టణంలోని డాక్టర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్​ చిన్మయి రాధ మాట్లాడుతూ 18 నుంచి 22 వారాల  పిండాన్ని స్కాన్‌‌‌‌ చేయాలని, శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తిస్తే ట్రీట్మెంట్ అందించేందుకు వీలుంటుందని తెలిపారు. మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్‌‌‌‌ అవసరం లేకుండా ట్రీట్మెంట్  చేసే విధానంపై  ఆర్థోపెడిక్ డాక్టర్​ కార్తీక్ అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్​ చిన్మయి రాధను డాక్టర్లు శివదయాల్, సునంద, విజయకుమార్​ సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ డాక్టర్లు నవీన్​, చంద్రశేఖర్, సురేశ్, నవీన్ కుమార్, భానుచందర్, చంద్రమౌళి, కిరణ్ కుమార్ రెడ్డి,  సూఫీ, సునంద, వీణ, శ్రావణి, జయ, స్వర్ణలత  పాల్గొన్నారు.

పోడు రైతుల గ్రామ సభలో మళ్లీ లొల్లి 

మెదక్​ (కొల్చారం), వెలుగు: మండల కేంద్రమైన కొల్చారంలో పోడు రైతుల గ్రామ సభలో మళ్లీ లొల్లి జరిగింది. గత సోమవారం ఫారెస్ట్​, రెవెన్యూ, పంచాయతీరాజ్​ శాఖ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్​ వద్ద గ్రామసభ నిర్వహించారు. పోడు భూమి పట్టాల కోసం 98 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, 32 మంది మాత్రమే అర్హులని గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి దరఖాస్తులు ఓకే చేసి, ఎక్కువ మందివి రిజెక్ట్​ ఎందుకు చేశారని ఆఫీసర్లను నిలదీశారు. చాలా ఏండ్లుగా భూమి సాగుచేసుకుంటున్న రైతులకు అన్యాయం చేయొద్దని, అందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గ్రామ సభను బహిష్కరించారు. దీంతో చేసేదేమిలేక అధికారులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో బుధవారం సర్పంచ్, సెక్రటరీ ఆధ్వర్యంలో పోడు భూములపై చర్చించేందుకు మరోమారు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పోడు పట్టాల విషయంలో అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితోపాటు, ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా అర్హుల జాబితాలో పేరున్న వారికి, దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పోడు పట్టాలివ్వాలని తీర్మానం చేశారు. 

మెదక్ లో ఎమ్మెల్సీ కవితకు సన్మానం

మెదక్​, వెలుగు:  కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్​ లో త్రిలింగేశ్వర ఆలయ దర్శనానికి వెళ్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బుధవారం మెదక్ పట్టణంలో ఆగారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్​ చైర్మన్​ ఆరెళ్ళ మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో ఆమెకు తలపాగా చుట్టి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ టౌన్​ ప్రెసిడెంట్​ గంగాధర్, కౌన్సిలర్​ సమియొద్దీన్​, నాయకులు జీవన్ రావు, శ్రీకాంత్, జుబేర్, కిరణ్, కిషన్, ఉమర్,  వేణుగోపాల్ రావు, మధు పాల్గొన్నారు.

భగుళాముఖి ఆలయంలో హోమం

మెదక్​ (శివ్వంపేట), వెలుగు:  కార్తీక మాసం అమావాస్య సందర్భంగా శివ్వంపేట మండల కేంద్రంలోని భగుళాముఖి శక్తిపీఠం ఆలయంలో బుధవారం హోమం నిర్వహించారు. నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత పాల్గొని ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ మెంబర్,  స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వేద  పండితులు వెంకటేశ్వర శర్మ, పురుషోత్తం శర్మ జడ్జి అనితను సన్మానించారు. కార్యక్రమంలో అడ్వకేట్లు అంజిరెడ్డి, శ్రీనివాస్​ ఉప సర్పంచ్ పద్మావెంకటేశ్​ పాల్గొన్నారు.

‘గజ్వేల్​ మార్కెట్​ నిర్వహణ బాగుంది’

గజ్వేల్, వెలుగు : దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులకు  నాణ్యత, స్వచ్ఛత గుర్తింపు సర్టిఫికెట్లు అందించే  ఫుడ్​సేఫ్టీ స్టాండర్డ్స్​ఆథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారుల బృందం గజ్వేల్​ ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ను మంగళవారం సందర్శించింది. మార్కెట్​లోని శుభ్రత,  నాణ్యత కోసం చేపడుతున్న చర్యలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.  మార్కెట్​లో నాణ్యమైన కూరగాయలు, పండ్లు విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు మార్కెట్​ కమిటీ చైర్మన్​ మాదాసు శ్రీనివాస్​ తెలిపారు. ఆఫీసర్లు మాట్లాడుతూ ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర, 
ఫుడ్ సేఫ్టీ అడిటర్ కృష్ణ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇయాల్టి నుంచి జిల్లా స్థాయి సైన్స్​ ఫెయిర్​

మెదక్​ గోల్​ బంగ్లా ముస్తాబు..500 ఎగ్జిబిట్లు వచ్చే అవకాశం


మెదక్, వెలుగు :  స్టూడెంట్స్​ లో దాగి ఉన్న శాస్ర్తీయ పరిజ్ఞానాన్ని వెలికి తీసి భవిష్యత్​ శాస్త్ర వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన జిల్లా స్థాయి సైన్స్​ ఫెయిర్​ గురువారం నుంచి మెదక్  జిల్లా కేంద్రంలో ప్రారంభం కానుంది. చారిత్రక గోల్​ బంగ్లా (వెస్లీ హైస్కూల్​) లో మూడు రోజుల పాటు కొనసాగే ఈ సైన్స్​ ఫెయిర్​ నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లు ​ పార్టిసిపేట్​ చేస్తున్నాయి. జూనియర్, సీనియర్​ విభాగాల్లో కలిపి 450 నుంచి 500 ఎగ్జిబిట్లు సైన్స్​ ఫెయిర్​ లో ప్రదర్శనకు వస్తాయని అంచనా వేశారు. 

నిర్వహణకు 18 కమిటీలు 

డీఈఓ రమేశ్​కుమర్​, డిస్ట్రిక్ట్​ సైన్స్​ ఆఫీసర్​ రాజిరెడ్డి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్​, అడ్మినిస్ట్రేషన్​, అకామిడేషన్​, ఫుడ్​ ప్రిపరేషన్, డెకరేషన్, స్టేజ్​ అరెంజ్​ మెంట్, కల్చరల్​ ప్రోగ్రామ్స్​కండక్ట్, ట్రాన్స్​పోర్ట్, జడ్జిమెంట్​ తదితర పనుల కోసం మొత్తం 18 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలకు సీనియర్​ హెడ్మాస్టర్లు, టీచర్లను ఇన్​చార్జీలుగా నియమించారు. గురువారం జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ హరీశ్​సైన్స్​ ఫెయిర్​ ను ప్రారంభించనున్నారు. 

ఉత్సాహంగా ‘కళా ఉత్సవ్’​

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్​ పట్టణంలో కళా ఉత్సవ్ జిల్లా స్థాయి  పోటీలలో రెండో రోజైన బుధవారం ఉత్సాహంగా కొనసాగాయి. శాస్త్రీయ, జానపద వాయిద్య పోటీలు, ఏకపాత్రాభినయం, చిత్ర లేఖనం, బొమ్మల తయారీ పోటీలు జరిగాయి. వాయిద్య పోటీలలో విద్యార్థులు హర్మోనియం, సన్నాయి, డప్పు, కాంగోలను వాయించారు. ఏకాపాత్రాభినయంలో సావిత్రి బాయి పూలే, రాణి శంకరమ్మ , రైతుల పాత్రలతో అభినయించారు. చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు వివిధ అంశాలను ప్రతిబింభించేలా చిత్రాలు గీశారు. ఒక్కొక్క విభాగం నుంచి బాలుర బాలికలను వేర్వేరుగా ఒక్కొక్కరిని రాష్ట్ర స్థాయికి  పంపనున్నారు.  ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్, సెక్టోరియల్ అధికారి సుభాష్, మండల విద్యాధికారి నీలకంఠం పర్యవేక్షించారు.  కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యులు రామేశ్వర ప్రసాద్, సుదర్శన మూర్తి, అంజాగౌడ్, మంగళ జోషి, పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.9 కోట్లు

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మెదక్  ఎమ్మెల్యే పద్మా  దేవేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్​ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.3.90 లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధుల ద్వారా గ్రామాలలో సీసీ రోడ్డు వేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్​, మంత్రులు హరీశ్​రావు, ఎర్రవల్లి దయాకర్ రావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.