Brendan Taylor: టేలర్ కంబ్యాక్ అదుర్స్.. మూడున్నరేళ్లు క్రికెట్ ఆడకపోయినా టాప్ స్కోరర్

Brendan Taylor: టేలర్ కంబ్యాక్ అదుర్స్.. మూడున్నరేళ్లు క్రికెట్ ఆడకపోయినా టాప్ స్కోరర్

జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ నిషేధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో గురువారం (ఆగస్టు 7) ప్రారంభమైన రెండో టెస్టు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా పేరున్న టేలర్ తన కంబ్యాక్ మ్యాచ్ లో అదరగొట్టాడు. జట్టు విఫలమైనా తాను మాత్రం రాణించాడు. 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 125 పరుగులకే ఆలౌటైంది. వీటిలో టేలర్ 107 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి జట్టు పరువును కాపాడాడు.

39 ఏళ్ల టేలర్ సెప్టెంబర్ 2021లో అకస్మాత్తుగా రిటైర్ అయిన తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడుతూ కనిపించలేదు. టేలర్ 2004 నుంచి 2021 మధ్య జింబాబ్వే తరపున 34 టెస్టులు ఆడాడు. 36.25 యావరేజ్ తో 2320 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రీ ఎంట్రీలో ఈ వెటరన్ బ్యాటర్ ఫామ్ పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే అందరి అంచనాలకు చెక్ పెడుతూ టేలర్ అద్భుతంగా రాణించాడు. కఠినమైన న్యూజిలాండ్ బౌలర్లను ఎదర్కొంటూ తనలోని పాత ఫామ్ ఇంకా అలాగే ఉందని నిరూపించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో జింబాబ్వే 125 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది.     

అసలేం జరిగిందంటే..?
 
2022 లో బ్రెండన్ టేలర్ పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఒప్పుకున్న టేలర్ కు..ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ లో  ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ను ఉల్లంఘించినందుకు అతడి మీద మూడున్నరేళ్ల పాటు నిషేధం వేసింది. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15 వేల అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. 

2021 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్‌.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు తనకు కొకైన్‌ ఆఫర్‌ చేశారన్నాడు. తాను కొకైన్‌ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కూడా చేయమన్నారని సంచలన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు.