మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ లెజెండ్ బ్రెట్ లీకి అరుదైన గౌరవం దక్కింది. అతని పేరును ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చారు. అసాధారణమైన వేగం, అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన లీ.. చాలా సందర్భాల్లో క్రీడా స్ఫూర్తిని కూడా చాటాడు. దాంతో అతని కెరీర్‌కు గౌరవ సూచకంగా ఈ పురస్కారాన్ని కట్టబెట్టారు. 1999 నుంచి 2012 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెట్ లీ 76 టెస్ట్‌లు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 718 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో 310, వన్డేల్లో 380, టీ20ల్లో 28 ఉన్నాయి.
ఆసీస్ 1999, 2003, 2007 వరల్డ్ కప్ గెలవడంలో బ్రెట్ లీ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు. నిలకడగా 160 కి.మీ/హెచ్ వేగంతో బాల్స్ వేయడంలో లీ సిద్ధహస్తుడు. వేగంతో పాటు బాల్‌ను స్వింగ్, బౌన్స్ చేయడంలోనూ దిట్ట. ప్రతిష్టాత్మకమైన అలెన్ బోర్డర్ పతకం అందుకున్న తర్వాత 2008లో ఆస్ట్రేలియన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా ఎంపికయ్యాడు. టీమిండియాపై అత్యుత్తమంగా రాణించిన లీ.. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు.
