ఏజెంట్లను పెట్టుకొని మరీ లంచాలు

ఏజెంట్లను పెట్టుకొని మరీ లంచాలు

కలెక్షన్ ఏజెంట్లతో కరప్షన్

ఏసీబీకి చిక్కకుండా కొందరు ప్రభుత్వ అధికారుల స్కెచ్

ట్రాప్ నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటు మాస్క్

కోర్టుల్లో కేసులు వీగిపోయేందుకు ప్లాన్

‘ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రైవేట్ వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. కొంతమంది అవినీతి అధికారులకు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. వీరు అధికారుల ఆదేశాలతో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు. ఇలాంటి కేసుల్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కకుండా అవినీతి అధికారులు ఎస్కేప్ అవుతున్నారు. గతేడాది ప్రైవేట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అరెస్ట్‌లే ఉదాహరణలు.’

హైదరాబాద్,వెలుగు: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రైవేటు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోర్టులో కేసులు వీగిపోయేందుకు వీరు వేస్తున్న ఎత్తులు ఏసీబీ అధికారులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇలాంటి కేసుల్లో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కుతున్న ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్న ఏసీబీకి ప్రాసిక్యూషన్ సమస్యలు ఎదురవుతున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ సిబ్బందితోపాటు బంధువులు, స్నేహితులను మీడియేటర్స్‌గా వాడి కొందరు అధికారులు లంచాలు వసూలు చేస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇన్వెస్టిగేషన్ అధికారులకు సాక్ష్యాధారాలు చిక్కకుండా ప్రైవేట్ వ్యక్తులతో అవినీతికి పాల్పడుతున్నారని ఏసీబీ కేస్ స్టడీస్‌లో వెల్లడైంది. గతేడాది నమోదైన 10కేసుల్లో 9 మంది ప్రైవేటు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో బినామీ సంస్థలకు చెందిన మరో 19 మంది ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అరెస్ట్ చేసింది.

ఈఎస్ఐ స్కామ్ కేసులో ప్రైవేట్ సంస్థలు

ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో బినామీలు, ప్రైవేట్ వ్యక్తులతోనే అవినీతి దందా నడిచిందని ఏసీబీ ఇప్పటికే తేల్చింది. మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ ప్రైవేటు ఫార్మా కంపెనీల పేర్లతో అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు సేకరించింది. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే మహ్మద్ గౌడ్ పాషా లాంటి ప్రైవేటు వ్యక్తులు ఈఎస్ఐ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు. నకిలీ బిల్లులు, పర్చేజింగ్ ఆర్డర్స్‌తో మెడికల్ కిట్స్, మందులు కొన్నట్టు లెక్కలు చూపారని దర్యాప్తులో తేలింది. దేవికారాణి ప్రైవేటు వ్యక్తులను తన సర్వెంట్స్‌గా మార్చుకుని ఐఎంఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ భారీ అవినీతికి పాల్పడ్డట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో..

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ప్రైవేట్ అసిస్టెంట్ మెన్స్, బిల్ కలెక్టర్స్‌తో అవినీతి ఎక్కువగా జరుగుతోందని ఏసీబీ గుర్తించింది. వినియోగదారులతో టచ్‌లో ఉండే లైన్ మెన్స్, అసిస్టెంట్ లైన్మెన్స్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మీటర్స్ శాంక్షన్ దగ్గర్నుంచి బిల్ పేమెంట్స్ వరకు ప్రైవేట్ సిబ్బందితో డబ్బు లు వసూలు చేస్తున్నారని గతేడాది నమోదైన కేస్ స్టడీస్ చెబుతున్నాయి.

రెవెన్యూలో రియల్ వ్యాపారులదే హవా

రెవెన్యూ ఆఫీసుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, సిబ్బందితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. రియల్ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులతో లంచం డబ్బులు చేతులు మారుతున్నాయని వివరాలను ఏసీబీ సేకరించింది. ఇలాంటి ప్రాంతాల్లో రైతులు, రియల్ ఎస్టేట్, దళారులు కలిసి అధికారులకు డబ్బు, గిఫ్ట్ల రూపంలో లంచం అందిస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. ఇలాంటి కేసుల్లో బాధితుల ఫిర్యాదుతో దాడులు చేస్తున్న ఏసీబీ అధికారులు.. ప్రైవేటు వ్యక్తులనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకో గలుగుతున్నారు. ఎలక్ట్రిసిటీ, రెవెన్యూతో పాటు మున్సిపల్, సబ్ రిజస్టార్ ఆఫీసుల్లో ప్రేవేటు వ్యక్తుల అవినీతి దందా కొనసాగుతోంది. శనివారం మున్సిపల్ ఫలితాల అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రస్తావన తీసుకొచ్చారు. రెవెన్యూ చట్టాలను మరింత పటిష్ఠం చేసి అవినీతి లేకుండా చేస్తామన్నారు.

లంచం అడిగితే 1064 కాల్ చేయండి

గతేడాది దుండిగల్ మున్సిపల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ శ్రీకిరణ్ ఏసీబీకి చిక్కాడు. లంచం అడిగిన మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ మేనేజర్ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ వంగాల కృష్ణగౌడ్ అరెస్టయ్యారు. గత ఆగస్టులో మియాపూర్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డి.రమేశ్, సబ్ ఇంజనీర్ కె.పాండు ఏసీబీకి చిక్కారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.