భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. ఇటుక దందా ఇష్టారాజ్యం!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. ఇటుక దందా ఇష్టారాజ్యం!
  • విచ్చలవిడిగా వెలుస్తున్న బట్టీలు 
  • మొత్తం 70 వరకు ఉంటే అందులో పర్మిషన్​ ఉన్నవి 16 మాత్రమే 
  • ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు 
  • అనుమతుల్లేకుండా బోర్లు.. కరెంట్ కనెక్షన్లు బాల కార్మికులతో వెట్టిచాకిరీ
  • మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్, అండర్ ​గ్రౌండ్ ​శాఖల్లో సమన్వయలోపం!
  • ఇదే అదనుగా రెచ్చిపోతున్న వ్యాపారులు 

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇటుక బట్టీలు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. మొత్తం 70 వరకు ఉంటే అందులో 54 బట్టీలకు అనుమతులు లేవు. రూల్స్​ ఏవీ పాటించకుండా అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్​, అండర్​గ్రౌండ్​ వాటర్​ శాఖల మధ్య సమన్వయ లోపంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
 
ఎక్కవ ఇక్కడే.. 

జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, చండ్రుగొండ, టేకులపల్లి, బూర్గంపహడ్, హేమచంద్రాపురం, లోతువాగు, అనిశెట్టిపల్లి, బొమ్మనపల్లి, కారుకొండ రామారం, పెనుబల్లి, పాతకొత్తగూడెం ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. బట్టీల ఏర్పాటుకు మైనింగ్​శాఖ నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉన్నా వ్యాపారులు అవేవీ పట్టించుకోవడం లేదు. జిల్లాలో దాదాపుగా 70 వరకు ఇటుక బట్టీలు ఉండగా అందులో కేవలం 16 బట్టీలకు మాత్రమే మైనింగ్ డిపార్ట్​మెంట్ నుంచి పర్మిషన్లు ఉన్నాయి. 

అంతా వాళ్ల ఇష్టం.. 

అక్రమంగా ఇటుబట్టీలను ఏర్పాటు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నారు. ఇటుకబట్టీల్లో ఉపయోగించే కలపలో కొంత మొత్తం అధికారికంగా తెచ్చుకొని మిగతా కల్పను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

తమ కళ్ల ముందే ఇటుకబట్టీలు నడుస్తున్న పంచాయతీ సెక్రటరీలు, రెవెన్యూ అధికారుల పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బట్టీల నిర్వహణకు విద్యుత్​ శాఖాధికారులు త్రీఫేస్​ కరెంట్​ కనెక్షన్స్​ ఇస్తుండడం గమనార్హం. ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి కార్మికులను తెచ్చే బట్టీల్లో పనులు చేయిస్తున్నారు. కార్మికుల పిల్లలు కూడా పనిలో పెట్టుకుంటూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పేరుకే సమీపంలోని అంగన్వాడీ సెంటర్లలో పిల్లల పేర్లను నమోదు చేయిస్తున్నారు. బట్టీల వద్ద కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదు. 

ఇబ్బందుల్లో స్థానికులు.. 

ఎక్కడబడితే అక్కడ బట్టీలు ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటుకలు తీసుకెళ్తేందుకు వస్తున్న ట్రాక్టర్లతో రోడ్లన్నీ గంతలమయంగా మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో ఎగిసిపడుతున్న దుమ్ముతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా వెలుస్తున్న ఇటు బట్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఆ ప్రాంతాల్లో పర్మిషన్లు లేవు..

జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న హేమచంద్రాపురం, అనిశెట్టిపల్లి, కారుకొండ రామారం, బొమ్మనపల్లి, పెనుబల్లి, లోతువాగు ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు మైనింగ్​ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు​లేవు.  ఇల్లీగల్​గా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఏర్పాటు చేస్తున్న బట్టీల గురించి రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు మాకు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో కొంత ఇబ్బంది కలుగుతోంది. 

జైసింగ్, జిల్లా మైనింగ్​ఆఫీసర్.