- గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణం
గాంధీనగర్: పెండ్లికి గంట ముందు చీర విషయంలో వధూవరుల మధ్య జరిగిన గొడవ ఓ ప్రాణం తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి, అదే కోపంలో పెండ్లికొడుకు కాబోయే భార్యపై దాడి చేశాడు. ఇనుప పైప్‌తో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. ఏడాదిన్నరగా కలిసి ఉంటున్న సాజన్ బరయ్య, సోని హిమ్మత్ రాథోడ్‌కు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీళ్ల పెండ్లి శనివారం జరగాల్సి ఉండగా అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇంకో గంటలో పెండ్లి ముహూర్తం ఉందనగా వధూవరుల మధ్య చీర విషయంలో వాగ్వాదం మొదలైంది. అదే కోపంలో పక్కనే ఉన్న ఇనుప పైప్ తీసుకుని పెండ్లి కూతురు సోనిపై సాజన్ దాడి చేశాడు. ఆపై ఆమె తలను గోడకేసి బాదాడు. దీంతో తీవ్రగాయాలతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో సాజన్ పరారయ్యాడు.
సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌కు వెళ్లి సోని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ‘‘వారి కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ జంట ఏడాదిన్నరగా కలిసే ఉంటోంది. ఇద్దరి మధ్య చీర, డబ్బు విషయంలో గొడవ జరిగింది”అని పోలీసులు తెలిపారు.
