ముక్కు పొడుగ్గా ఉందని పెళ్లి వద్దంది

ముక్కు పొడుగ్గా ఉందని పెళ్లి వద్దంది

నిశ్చితార్థం అయ్యాక పెళ్లి వద్దంది

కోర్టుకెళ్లిన బెంగళూరు యువకుడు

అమ్మాయి ఫ్యామిలీపై క్రిమినల్​ కేసు పెట్టాలన్న కోర్టు

అప్పటికే పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేసిన యువకుడు

వాళ్లిద్దరూ మ్యాట్రిమోనియల్​ సైట్​లో పరిచయమయ్యారు. మాటలు కలిశాయి.. మనసులు ఒక్కటయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలు మాటముచ్చట చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ, కొన్నాళ్లయ్యాక ఆ అమ్మాయి మనసు మార్చుకుంది. పెళ్లి వద్దంది. దానికి ఆ అమ్మాయి చెప్పిన కారణం, అబ్బాయిది నడ్డి ముక్కని, చాలా పొడవుగా ఉందని!!! ఆ అమ్మాయిని అబ్బాయి ఎంతో కన్విన్స్​ చేశాడు. కానీ, ఫలితం లేదు. అప్పటికే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన ఆ యువకుడు, అమ్మాయి మీద, వారి కుటుంబం మీద కేసు పెట్టాడు. కోర్టుకెళ్లాడు. ఆ కుటుంబం మీద క్రిమినల్​ కేసు పెట్టాలని కోర్టు కూడా ఆర్డర్​ వేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

ఇదీ జరిగింది..

కోరమంగళలోని ఆరో బ్లాక్​కు చెందిన ఓ యువకుడికి (35) మ్యాట్రిమోనియల్​ సైట్​లో అమెరికాలో పనిచేస్తున్న ఓ ఇండియన్​ యువతి (35) పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్​ అయ్యారు. ‘‘పోయినేడాది ఆగస్టు 13న ఆ అమ్మాయి సిటీకి వచ్చింది. ఎంజీ రోడ్​లోని ఓ స్టార్​ హోటల్​లో లంచ్​ చేశాం. మ్యారేజ్​ ఫిక్స్​ చేసుకోవాలనుకున్నాం. తన అక్కకు నచ్చాలని ఆమె చెప్పడంతో, ఆమె అనుమతీ తీసుకున్నాం. ఆగస్టు 26న మా అమ్మానాన్నలు, హెచ్​ఎస్​ఆర్​ లేఅవుట్​లో ఉండే అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడారు. అన్నీ కుదిరాయి. సెప్టెంబర్​ 9న వాళ్ల ఇంట్లో మాకు ఎంగేజ్​మెంట్​ కూడా అయింది” అని ఆ యువకుడు కోర్టులో వాపోయాడు. తిరుమలలో పెళ్లి చేస్తామని అమ్మాయి వాళ్లు చెప్పడంతో, బంధువులందరూ ఇక్కడే ఉన్నారన్న కారణంతో బెంగళూరులోనే పెట్టుకుందామని చెప్పామన్నారు. అయితే, అమ్మాయి పట్టుబట్టడంతో అందుకూ ఒప్పుకున్నామని చెప్పారు. ఈ నెల 30న ముహూర్తం కూడా పెట్టుకున్నామన్నారు. ‘‘రూములను బుక్​ చేసేందుకు నేను తిరుమల వెళ్లాను. లక్ష రూపాయలు అడ్వాన్స్​ కట్టి 70 రూములు, కేటరింగ్​ బుక్​ చేశాను. రూ.4 లక్షలు పెట్టి పెళ్లి బట్టలు, గిఫ్టులు కొన్నాను. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమో కొన్ని రోజులకు పెళ్లి వద్దని ఆ అమ్మాయి చెప్పింది. పోయినేడాది అక్టోబర్​లో మా నాన్నకు అమ్మాయి ఫోన్​ చేసి పెళ్లి ఆపేయమంది” అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నడ్డి ముక్కంది.. ఆపరేషన్​ చేయించుకోమంది

అమ్మాయి పెళ్లి వద్దనడంతో అక్టోబర్​ 23న తాను ఆ అమ్మాయికి ఫోన్​ చేశానని ఆ యువకుడు చెప్పాడు. ‘‘నేను ఫోన్​ చేసినా పెళ్లి వద్దనే చెప్పింది. నాది నడ్డి ముక్కని, చాలా పొడవుగా ఉందని వెక్కిరించింది. ఆపరేషన్​ చేయించుకోమంది. నేను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. ఎన్ని సార్లు చేసినా అవే వెక్కిరింపులు. చివరికి నా నంబర్​ను బ్లాక్​ చేసేసింది. వాళ్ల కుటుంబం కూడా మా ఫోన్లు ఎత్తట్లేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నన్నే కాకుండా ఇంకా వేరే వాళ్లను కూడా ఆమె మోసం చేసి ఉండొచ్చు” అని పేర్కొంటూ కోర్టులో పిటిషన్​ వేశాడు. క్రిమినల్​ కేసు పెట్టాలని కోర్టు ఆదేశాలివ్వడంతో కోరమంగళ పోలీసులు డిసెంబర్​ 31న ఆ అమ్మాయి, అమ్మాయి ఫ్యామిలీ, ఆమె అక్కపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆ అమ్మాయి వివరణ కూడా తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అప్పుడే కేసు తేలుతుందంటున్నారు.