ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కాగజ్ నగర్, దహెగాం, వెలుగు: దహెగాం మండలం లగ్గాం వద్ద పెద్దవాగు(అందవెల్లి) బ్రిడ్జి, అప్రోచ్​రోడ్డు కొట్టుకుపోగా బీజేపీ ఆధ్వర్యంలో శ్రమదానం చేసేందుకు పిలుపునివ్వగా బీజేపీ నేతలను అరెస్ట్ చేసి, పోలీసు స్టేషన్​తరలించడమేంటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ  ప్రశ్నించారు. గురువారం కాగజ్​నగర్​, దహెగాంలలో వేర్వేరుగా ప్రెస్​మీట్​లో మాట్లాడారు. మండిపడ్డారు. పెద్దవాగు బ్రిడ్జి కుంగిపోయి ఏడాదయినా రిపేర్ చేసేందుకు ఎమ్మెల్యే , అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి రాజమౌళి గౌడ్,  అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేశ్, లీడర్లు హరీశ్​బాబు, విజయ్ సింగ్ పాల్గొన్నారు. 

ఉత్సాహంగా ఫ్రీడమ్​ కప్​ పోటీలు 

మంచిర్యాల, వెలుగు: స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మంచిర్యాల బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్​లో నిర్వహించిన ఫ్రీడమ్​కప్​ పోటీలు ఉత్సాహంగా సాగాయి. కలెక్టర్​ భారతి హోళికేరి, డీసీపీ అఖిల్​ మహాజన్​, డీవైఎస్​వో శ్రీకాంత్​రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. రన్నింగ్​, వాలీబాల్​, షార్ట్​పుట్​, ఖోఖో, కబడ్డీ, చెస్​ పోటీలు జరిగాయి. 
ఆదిలాబాద్, వెలుగు : వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన పలు క్రీడల్లో విజేతలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ బహుమతులు అందజేశారు. 20 రకాల క్రీడల్లో 6,313 మంది క్రీడకారులు పాల్గొన్నారని, 249 మంది విజేతలుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, ఒలింపిక్​అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.     

ఆసిఫాబాద్ ,వెలుగు : క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆసిఫాబాద్​కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన ఆటల పోటీలకు అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , ఎస్పీ సురేశ్​కుమార్ తో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ రెండు జట్లుగా క్రికెట్ ఆడగా కలెక్టర్ జట్టు గెలుపొందింది. 

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం 

నిర్మల్, వెలుగు: క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ముషారఫ్ ఫారుకి పేర్కొన్నారు. గురువారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ కప్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బొర్కడే తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గుగనిని గురువారం పోలాండ్ దేశానికి చెందిన ఫెమర్ కంపెనీ ప్రతినిధులు జాన్, రాఫెల్​సందర్శించారు. గనిలో పని స్థలాలు, బొగ్గు నిల్వలు.. తదితర వివరాలను గని ప్రాజెక్ట్ అధికారి కె. వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలాండ్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఫెమర్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ గనిలో బొగ్గును వెలికి తీయడానికి లాంగ్ వాల్, షాట్ వాల్ యంత్రాలు ప్రవేశపెట్టాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోందని పీవో తెలిపారు. దీనిపై మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, గని ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్లు, ఇన్​చార్జి మేనేజర్ రాజులతో ప్రతినిధులు చర్చించారు. అనంతరం  మ్యాన్ వైండర్ ద్వారా బొగ్గు గనిలోకి దిగిన పోలాండ్ ప్రతినిధులు లాంగ్ వాక్ ప్రిపరేషన్ కోసం జరుగుతున్న పనులను పరిశీలించారు. 

జీవో 76 పై స్పష్టత ఇవ్వాలి 

బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వం జారీ చేసిన జీవో 76 పై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి ప్రెస్​క్లబ్​లో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్ యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి చిలుముల శంకర్​ మీడియాతో మాట్లాడారు. ఇండ్ల స్థలాలకు పట్టాలిప్పిస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత పేరుతో నెల రోజులుగా పట్టణంలోని వార్డుల్లో ప్రచారం చేశారని, దీంతో అనేక మంది ప్రజలు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. నేటికీ దరఖాస్తు చేసుకున్న ఒక్క ఇంటికి పట్టా రాలేదని ఆరోపించారు. మున్సిపాలిటీ ఇంటి నంబర్లు ఇవ్వకపోవడంతో విద్యుత్ శాఖ కరెంట్​కనెక్షన్లు ఇవ్వడం లేదని దీంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇండ్ల పట్టాల పేరుతో ఎమ్మెల్యే చిన్నయ్య మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ బెల్లంపల్లి టౌన్  ప్రెసిడెంట్ శ్రీనివాస్, లీడర్లు వెంకటేశ్, శ్యామ్, ఆకాశ్, రాజలింగు, ఆనంద్, రవి, మొండి పాల్గొన్నారు.

గ్రీన్​సిటీ యజమానులపై డీసీపీకి ఫిర్యాదు

 మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ వెంచర్​లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి యజమానులు కాలనీ అభివృద్ధి పేరిట గజానికి రూ.వంద చొప్పున వసూలు చేసి పనులు చేయడం లేదని గ్రీన్​సిటీ అసోసియేషన్​ అధ్యక్షుడు శోభన్​రావు, సభ్యులు గురువారం డీసీపీ అఖిల్​ మహాజన్​కు ఫిర్యాదు చేశారు. గ్రీన్ సిటీలో 388 ప్లాట్లు, లక్షా రెండు వేల గజాలకు రూ.కోటి 2లక్షలు వసూలు చేశారన్నారు. ఆ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీ పైసలతో దేవాలయం, సీసీ కెమెరాలు, శానిటేషన్​ నిర్వహణకు వినియోగించాల్సి ఉండగా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ దగ్గర వసూలు డబ్బులు వడ్డీతో సహా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. 

మునుగోడు సభను సక్సెస్​ చేయండి

కాగజ్ నగర్, వెలుగు: ఈ నెల 21న మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ ను సక్సెస్​చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని అఫీస్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ సిర్పూర్ నియోజక వర్గ ఇంఛార్జి రాజమౌళి గౌడ్, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రచారి, హరీశ్​బాబు, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్, మండల అధ్యక్షులు శ్రీశైలం, వాను పటేల్ పాల్గొన్నారు.