వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎంజీఎం, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంకు నిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తిన నేరుగా ఎంజీఎంకే పరుగులు తీస్తుంటారు. దీంతో వెయ్యి పడకల ఆ ఆసుపత్రిపై అధిక భారం పడుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం వరంగల్ నగరానికి ఐదు బస్తీ దవాఖానాలు మంజూరు చేసింది. వరంగల్ క్రిస్టియన్  కాలనీ, గిరిప్రసాదర్​ నగర్​, బీఆర్​ నగర్​తో పాటు హనుమకొండలోని బోడగుట్ట, కాజీపేట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఆయా దవాఖానల్లో  ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక ఆఫీస్ సబార్డినేట్  విధులు నిర్వహిస్తారు. ఉదయం 9  నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ బస్తీ దవాఖానలు పనిచేస్తాయి.

పరిశీలించిన డీఎంహెచ్ వో

వరంగల్ లోని బస్తీ దవాఖానాలను వరంగల్ డీఎంహెచ్​వో డాక్టర్ వెంకటరమణ బుధవారం పరిశీలించారు. క్రిస్టియన్ కాలనీ, గిరి ప్రసాద్ నగర్, బీఆర్ నగర్ లను పరిశీలించి వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆయన వెంట  స్థానిక కార్పొరేటర్  వస్కుల బాబు, డీపీవో అర్చన, ఆరోగ్య సిబ్బంది, అంగన్​ వాడీ  సిబ్బంది, తదితరులున్నారు.

మంత్రి అండతోనే బ్యాంక్ కాంప్లెక్స్​ లీజ్

వరంగల్, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సహకారం వల్లే డీసీసీబీ బ్యాంక్ కమర్షియల్ కాంప్లెక్స్ లీగ్ అగ్రిమెంట్ జరుగుతోందని వర్ధన్నపేట సొసైటీ బ్యాంకు మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీఐ సహకార బ్యాంకుల రూల్స్ లకు విరుద్ధంగా డీసీసీబీ బ్యాంక్ కాంప్లెక్స్ ను లీజ్,  సబీ లీజుకు ఇస్తున్నారన్నారు. మంత్రి, డీసీసీబీ చైర్మన్ లోపాయికారి ఒప్పందం వల్లే ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాము ఎవరికీ లీజు ఇవ్వమని బ్యాంకు సీఈవో సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ.. మరోవైపు కాంట్రాక్టర్ అక్రమంగా పనులు నిర్వహించడంపై మండిపడ్డారు. లీజు విషయంలో మూడు నెలలుగా బ్యాంకు కాంప్లెక్స్ లో పనులు జరుగుతుంటే.. డీసీసీబీ చైర్మన్ ఇతర అధికారులకు సోయి లేదా అంటూ ప్రశ్నించారు.

సమస్యల పరిష్కారం ఇంకెప్పుడు?

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో బుధవారం ఎంపీపీ మేకల స్వప్న ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్​కుమార్​హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ సమస్యలను లేవనెత్తారు. కరెంట్ సమస్యలు పరిష్కరించడం లేదని ఏఈ స్వామి నాయక్​ను నిలదీశారు. మిషన్​భగీరథ నీళ్లు ఏ సమయంలో ఇస్తున్నారో చెప్పాలని ఆఫీసర్లను ప్రశ్నించారు. ఎల్కతుర్తి ఆర్టీసీ బస్టాండ్​ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్​అర్పితను ఎల్కతుర్తి సర్పంచ్ ప్రశ్నించగా, తమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదని.. మరుగుదొడ్ల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే అప్పగిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ తరఫున హాజరైన హెడ్​కానిస్టేబుల్ చలపతి, ఎలాంటి నివేదికను సభకు సమర్పించకపోవడంతో ఆఫీసర్లు, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సబిత, ఎంపీడీవో సునీత, తహసీల్దార్ రవీందర్​రెడ్డి తదితరులున్నారు.

దేశభక్తిని పెంపొందించాలి

జనగామ అర్బన్, వెలుగు: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించి, దేశభక్తిని పెంపొందించాలని కలెక్టర్ శివిలింగయ్య ఆఫీసర్లకు సూచించారు. బుధవారం మండల ఆఫీసర్లతో వజ్రోత్సవ ఏర్పాట్లపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గాంధీ సినిమాను అందరూ చూసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం సూచించిన రోజూ వారీ కార్యక్రమాలను విధిగా నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు జరిపారు. బ్రహ్మకుమారీస్ జనగామ ఇన్​చార్జి బీకే విజయలక్ష్మి కలెక్టర్​కు రాఖీ కట్టారు.

వెంకన్న ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు
  
రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్​నిర్మాణం, ఆధునీకీకరణకు రూ.10 కోట్లు మంజూరైనట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వెల్లడించారు. కొద్ది నెలల కింద జనగామకు వచ్చిన సీఎం కేసీఆర్ కు.. ఆలయ అభివృద్ధి గురించి వినతిపత్రం ఇచ్చామన్నారు. ఈమేరకు సీఎం స్పందించి, నిధులు సాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు.

కురవి హుండీ ఆదాయం రూ.50లక్షలు

కురవి, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించగా.. రూ.50.32లక్షలు సమకూరినట్లు ఆలయ సీఈవో సత్యనారాయణ తెలిపారు. లెక్కింపులో ఎండోమెంట్ ఇన్స్ పెక్టర్ కవిత, ధర్మకర్తలు పాల్గొన్నారు. 


వెంకటాపురం, వెలుగు: గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. బుధవారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి ఆయన పర్యటించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారని, రానున్న రెండు, మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులు నిర్వహించి, మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. కాగా, తమకు వరద సాయం అందలేదని చర్చిపేట గ్రామస్తులు కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు.

సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి..

మహదేవపూర్, వెలుగు: రక్తహీనతతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల బాధితులు కోరారు. ఈమేరకు కలెక్టర్ భవేశ్ మిశ్రాతో పాటు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్యకు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం 21 రకాల వ్యాధులకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించినా.. ఆన్ లైన్​లో 14 రకాల వ్యాధులు మాత్రమే కనిపిస్తున్నాయని వాపోయారు. దీంతో స్లాట్ బుక్ చేసుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లపై నాట్లు వేసిబీజేపీ లీడర్ల నిరసన

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సరైన రోడ్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పాడైన రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఆఫీసర్లు స్పందించి, రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. దళిత కాలనీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భూక్య జవహర్ లాల్, తక్కల్లపల్లి సుమన్ రావు, చెల్పూరు రవి, కారుపోతుల దేవేందర్ తదితరులున్నారు.

సాఫ్టెక్ లో ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్

హనుమకొండ సిటీ, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా సాఫ్టెక్ కంప్యూటర్స్​ లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సాఫ్టెక్​ మేనేజింగ్​ డైరెక్టర్ మధుమిత దండే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందరూ ఈజీగా నేర్చుకోగలిగే కోర్సులను నిరుపేద పిల్లలకు నేర్పిస్తామన్నారు. దాదాపు 200 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి, మెరిట్​స్టూడెంట్స్​కు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. 30 ఏండ్లుగా ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అడ్మిషన్ల కోసం కిషన్​ పుర, అదాలత్​ సమీపంలోని సాఫ్టెక్​ కంప్యూటర్స్​ ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 98660 55044, 92468 99300 నెంబర్లకు కాల్​ చేయొచ్చని సూచించారు. 

తాడిచర్ల పీహెచ్​సీలో24గంటల సేవలు

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలకేంద్రం తాడిచెర్ల పీహెచ్​సీని త్వరలో 24 గంటల ఆసుపత్రిగా మారుస్తామని అడిషనల్ కలెక్టర్ దివాకర హామీ ఇచ్చారు. బుధవారం ఆయన పీహెచ్​సీని సందర్శించి, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఏఎంఆర్ స్టాఫ్ సహకారంతో పీహెచ్​సీలో నిరంతరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని ఏఎంఆర్ సంస్థ సహకారంతో నియమించుకోవాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో  శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్​వో  కొమురయ్య, ఎంపీపీ మల్హర్ రావు, జడ్పీటీసీ ఐత కోమల రాజిరెడ్డి, ఎంపీడీవో నర్సింహమూర్తి తదితరులున్నారు.