చేనేత రంగానికి మంచి రోజులు తీసుకొస్తం : తుమ్మల నాగేశ్వరరావు

చేనేత రంగానికి మంచి రోజులు తీసుకొస్తం :  తుమ్మల నాగేశ్వరరావు

బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నారాయణ గూడ పద్మశాలి భవన్​లో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్. రమణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరంగల్, పోచంపల్లి, గద్వాల్ టెక్స్ టైల్ పార్క్ లు అసంపూర్తిగా ఉన్నాయని.. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. తనకు ఈ రంగంలో అనుభవం లేనప్పటికీ సంబంధిత అధికారులు, అనుభవజ్ఞులైన సంఘం ప్రతినిధులతో సూచనలు తీసుకొని చేనేత అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా  తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కమర్తపు మురళితో మంత్రి తుమ్మల ప్రమాణస్వీకారం చేయించారు.