జనగామ అర్బన్, వెలుగు: మహిళల ఆర్థిక ఎదుగుదలకి ఇందిరా మహిళా శక్తి పథకం ఎంతగానో దోహద పడుతుందని, మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందుతున్నారని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జనగామ పట్టణంలోని మున్సిపల్ఆఫీస్, సబ్ రిజస్ట్రార్ఆఫీస్ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీఆర్డీవో వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఈ స్థాళ్ల ద్వారా ఆయా మహిళలకు నిరంతర ఉపాధి కలగడంతో పాటు ఇతర స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదర్శంగా నిలువనున్నారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ గ్యారెంటీతో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని శివం రోడ్డు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కలెక్టర్‌ను సీపీఎం జనగామ పట్టణ కమిటీ బృందం సభ్యులు పట్టణంలోని వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
