ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో తనను నిర్బంధించి కొట్టిన ఎస్‌హెచ్‌వో సత్యనారాయణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లోని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 1న గ్రామంలో తనపై దాడి జరిగిందని, మరుసటి రోజు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.
డిసెంబర్ 22న నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, డిసెంబర్ 30న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారని తెలిపారు. ఉదయం పోలీస్‌స్టేషన్ కు వెళ్లిన తనను ఎస్ హెచ్ వో సత్యనారాయణ రబ్బర్ బెల్ట్‌తో కొట్టాడని మాజీ ఎంపీపీ కారును నువ్వే దహనం చేశావంటూ బూతులు తిట్టాడని వాపోయాడు. తనకు కారు దహనంతో సంబంధం లేదని చెప్పినా వినలేదన్నాడు.
