ములుగు/ తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మాస్టర్ ప్లాన్ పనుల్లో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులు గద్దెల వెనుకభాగంలో పలు అభివృద్ధి పనుల కోసం 19.20 ఎకరాల భూమిని సేకరించారు. ఈ క్రమంలో మొత్తం 43 మంది లబ్ధిదారులు భూమిని కోల్పోతుండగా, వారికి ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అయితే భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతమైన మేడారంలో ఎలాంటి గ్రామ సభ పెట్టకుండా తన అనుమతి తీసుకోకుండా భూమిని లాక్కున్నారంటూ ఇదే గ్రామానికి చెందిన సిద్ధబోయిన లక్ష్మీ హై కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్టే విధించడంతోపాటు ఏజెన్సీ చట్టాలను ఎందుకు పాటించడంలేదని అధికారులను మందలించినట్లు తెలిసింది.
మేడారంలో గద్దెల వెనుక భాగంలో స్థానిక రైతులకు సంబంధించిన 19.5 ఎకరాలను భూ సేకరణ చట్టం కింద రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు భవనాల నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన సిద్ధబోయిన లక్ష్మీ అనే మహిళా రైతు పేరుపై 190 సర్వే నెంబర్ లో ఎకరం 37గుంటల భూమి ఉంది. ఆ భూమిపై అనుభవదారులుగా ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కొడుకు రాజు ఆర్మీలో పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు ఆనంద్ ప్రభుత్వానికి ఎకరం భూమి అప్పగిస్తూ సంతకం చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై డిసెంబర్ 31న రైతు లక్ష్మీ హైకోర్టులో దావా వేయగా, విచారణ చేపట్టిన జడ్జి స్టే విధించినట్లు తెలిసింది. పట్టాదారులకు నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించకుండా ఎలా భూసేకరణ చేస్తారని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.
నిబంధనల మేరకే భూ సేకరణ చేపట్టినం..
కోర్టు స్టే అంశంపై తాడ్వాయి ఇన్చార్జి తహసీల్దార్ సురేశ్‌బాబును వివరణ కోరగా, నిబంధనల మేరకే 19.20 ఎకరాల భూమి సేకరించినట్లు వెల్లడించారు. మొత్తం 43 మంది భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20లక్షల చొప్పున పరిహారం అందజేశామన్నారు. అందులో మహిళా రైతు కొడుకు ఆనంద్ భూ సేకరణకు సంతకం కూడా చేశాడని, నిబంధలకు లోబడి మాత్రమే తాము సేకరణ చేశామని వివరించారు. ఆరోపణలు చేస్తున్న మహిళా రైతుకు సంబంధించిన భూమి ఒక చోట ఉంటే పొజిషన్ మరో చోట ఉందని, నిబంధనల మేరకు తాము ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
