మొదటిసారి ఉక్రెయిన్​లో పర్యటించిన బ్రిటన్ పీఎం 

మొదటిసారి ఉక్రెయిన్​లో పర్యటించిన బ్రిటన్ పీఎం 

స్వాతంత్ర్య పోరాటం అంటే ఏమిటో బ్రిటన్​కు తెలుసు: రిషి

కీవ్: తాము అండగా ఉంటామని, యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే వరకూ మద్దతు ఇస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం అంటే ఏమిటో బ్రిటన్ కు తెలుసని ఆయన అన్నారు. బ్రిటన్ ప్రధాని హోదాలో సునక్ మొదటిసారి శనివారం ఉక్రెయిన్​లో పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్  వోలోదిమిర్ జెలెన్ స్కీతో ఆయన భేటీ అయ్యారు. యుద్ధ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఉక్రెయిన్​కు మద్దతుగా రిషి ట్వీట్ చేశారు. ‘‘మేమంతా మీ (ఉక్రెయిన్) వెంటే ఉన్నాం జెలెన్ స్కీ. రష్యా దురాక్రమణను ఎదుర్కొంటున్న మీ ధైర్యాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతిప్రియుల్లో ఆశలు చిగురించాయి.

ఎన్ని కష్టాలు ఎదురైనా దురాక్రమణదారులు గెలవలేరని మీరు ఈ  ప్రపంచానికి సందేశం పంపారు. మీ శత్రువు గెలవడు. మీ ధైర్యం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. రష్యాను మీరు ఎదుర్కొంటున్న పోరాటాన్ని మా ముందుతరాల వారికి చెప్తాం” అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు మానవతాసాయం కొనసాగిస్తామని, ఆహారం, మెడిసిన్​ వంటి అత్యవసరాలు  అందజేస్తామని రిషి తెలిపారు. ఉక్రెయిన్​కు జీవితకాలం ఫ్రెండ్​గా ఉంటామని, ఆ దేశం మళ్లీ కోలుకుని, అభివృద్ధి చెందడంలో అండగా ఉంటామని రిషి సునక్ ఉక్రెయిన్​కు ఇదివరకే లెటర్​ రాశారు.

ఉక్రెయిన్ కు 490 కోట్ల ఎయిర్ డిఫెన్స్ ప్యాకేజీ

ఉక్రెయిన్ కు రూ.490 కోట్ల ఎయిర్ డిఫెన్స్ ప్యాకేజీని రిషి సునక్ ప్రకటించారు. 120 ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, రాడార్, యాంటీడ్రోన్ ఎక్విప్ మెంట్ అందిస్తామని ఆయన వెల్లడించారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 

మీ లాంటి దోస్తుంటే మాకు విజయమే: జెలెన్​స్కీ

ఉక్రెయిన్​లో పర్యటించినందుకు సునక్​కు జెలెన్ స్కీ థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచ శాంతి గురించి, యూరోప్, ఉక్రెనియన్ ఎనర్జీ భద్రత గురించి తామిద్దరం చర్చించామని తెలిపారు. ‘‘మీ (రిషి) లాంటి దోస్త్ ఉంటే విజయంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది” అని జెలెన్ స్కీ ఫేస్ బుక్​లో పోస్టు చేశారు.కాగా, ఉక్రెయిన్​లోని జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద శనివారం రాత్రి భారీ పేలుడు జరిగింది. యూరప్ లోనే ఇది అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్. పేలుడుతో దగ్గరలోని బిల్డింగ్స్,  ప్లాంట్​లోని సిస్టమ్స్, ఎక్విప్ మెంట్లు ధ్వంసమయ్యాయని యూఎన్ అణుశక్తి నిఘా చీఫ్​ గ్రోసీ ఒక ప్రకటనలో తెలిపారు.