ఆదివాసీ కూలీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దళారులు

ఆదివాసీ కూలీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దళారులు

భద్రాచలం, వెలుగు:  ఆంధ్రా, ఛత్తీస్‍గఢ్‍, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల గిరిజన పల్లెలకు ప్రధాన కేంద్రం భద్రాచలం. ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవిబిడ్డలు నిత్యం కూలీ పనుల కోసం భద్రాచలం వస్తుంటారు. ఇక్కడి నుంచి పెద్ద నగరాలు, ఇటుకబట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేసేందుకు వెళ్తుంటారు. మరికొందరైతే భద్రాచలంలోనే తాపీ పనులు, మిర్చి కోతలకు పోతారు. ఇలా వచ్చిన వారు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు.

ప్రతీ రోజు రెండు బస్సుల నిండా  కూలీలు వస్తుంటారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. తమ గోడు వినేవారు ఎవరో తెలియని దీనస్థితిలో ఉంటారు. బాలికలు, యువతుల అత్యాచారాలకు గురువుతున్నారు. తాపీ మేస్త్రీలు గతేడాది ఓ గదిలో యువతులను బంధించి వారిపై లైంగిక దాడికి దిగారు. స్థానికుల సాయంతో తీవ్రగాయాలతో ఇద్దరు బాలికలు పోలీసులను ఆశ్రయించారు. బయటకు రాని ఇలాంటి అమానవీయ ఘటనలు కోకొల్లలు. రోజుకు 100 మంది పనుల కోసం భద్రాచలం వస్తుంటారు. ఇలాంటి వారికి రక్షణ అవసరం. 

రూల్స్ ​కు విరుద్ధంగా మ్యాన్ సప్లయింగ్‍ కేంద్రాలు

భద్రాచలం కేంద్రంగా రూల్స్ కు విరుద్ధంగా కూలీలను సప్లై చేస్తున్నారు.  ఒక్క భద్రాచలంలోనే 50 మంది ఏజెంట్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదివాసీలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరంతా కూలీకి పోతున్నారని చెబుతున్నా, వీరి వివరాలు కార్మికశాఖ వద్ద గానీ, మరే ఇతర ప్రభుత్వ శాఖ వద్దగానీ ఉండవు. ఇదంతా చట్టవిరుద్ధంగానే సాగుతోంది. ఏజెంట్లు తమ ఇళ్ల వద్ద నుంచే దందా నిర్వహిస్తున్నారు. వలస ఆదివాసీలకు మాయమాటలు చెప్పి తీసుకొస్తున్నారు. వారికి మంచి భోజనం, ఇతరత్రా తాయిలాలు ఇచ్చి ఏ వివరాలు చెప్పకుండానే బెంగుళూరు, హైదరాబాద్​, కోల్‍కత్తా, చెన్నై వంటి నగరాలకు పంపిస్తున్నారు. కార్మికునికి ఇచ్చే కూలీ తెలియనివ్వరు. ఏజెంట్లు, కాంట్రాక్టర్ల మధ్యే సంప్రదింపులు, ఒప్పందాలు జరుగుతాయి.

ముందుగానే కాంట్రాక్టరు నుంచి ఏజెంటు ఆదివాసీల అందరిపైనా పని రోజులను బట్టి 50శాతం కూలీ తన ఖాతాలో వేయించుకుంటాడు. అక్కడ పని పూర్తయ్యాక మిగిలినవి ఏజెంటు ఖాతాలోకి వచ్చి చేరిపోతాయి. పని అయిపోయాక వారు తిరిగి వస్తే ఏజెంట్లు.. చేసిన పనిదినాలను కుదించి వారికి వచ్చే డబ్బులో 40‌‌‌‌‌‌‌‌శాతం వరకు మింగేస్తున్నాడు. అన్నీ పోనూ వచ్చిన కూలీలో సగం ఏజెంట్లే లాగేసుకుంటున్నారు. ఎవరైనా తిరగబడి అడిగితే వారిని గదుల్లో పెట్టి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పలుమార్లు ఆందోళనలు చేపట్టి, ఆదివాసీల అక్రమ రవాణాపై ఫిర్యాదులు కూడా చేశారు. ఆదివాసీలను హింసించిన ఏజెంట్లపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక వెళ్లిన ఆదివాసీలు చాలా మంది తిరిగి రారు. వారు మిస్సింగ్ అయినా ఎవరికీ పట్టింపు ఉండదు. దాదాపు ఐదుగురు అదృశ్యం అయినట్లుగా గతంలో  ఫిర్యాదులు వచ్చాయి. 

పునరావాస కేంద్రంతో సమస్యకు పరిష్కారం

భద్రాచలంలో అడవిబిడ్డల కోసం ఓ పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆదివాసీలు సంఘాలు డిమాండ్​చేస్తున్నాయి. దీని కోసం గిరిజన సంఘాలు ఐటీడీఏ పీవోను ఆశ్రయించాయి.  పునరావస కేంద్రం ఏర్పాటుతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఓ రక్షణ ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు.. ఏం పనిచేస్తున్నారో వివరాలు ఉంటాయి. దీనిపై గోండ్వానా సంక్షేమ పరిషత్​ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఐటీడీఏ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.