
సొంత అక్క ఇంట్లోనే చోరీ చేసిన తమ్ముడిని కాలాపత్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవాబ్ సాబ్ కుంటా బషారత్ నగర్ బస్తీలో ఉండే హజేరాబేగం అలియాస్ ఆబేదా బేగం భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటోంది. కొన్ని రోజుల క్రితం యాచారంలో ఉండే తమ్ముడు మహ్మద్ ఆయూబ్(35)ని హజేరా బేగం తన ఇంటికి రమ్మని తమ దగ్గరే ఉండమని చెప్పింది. ఇంట్లో అక్క నగలు చూసిన ఆయూబ్ వాటిని కొట్టే యాలని ప్లాన్ చేశాడు.
ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్రూంలోకి వెళ్లి అల్మారాలో ఉన్న సుమారు 7 తులాల బంగారు నగలు తీసుకుని ఆయూబ్ అక్కడి నుంచి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన హజేరా బేగం బెడ్రూంలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానంతో అల్మారాలో చూసింది. అందులో నగలు కనిపించకపోవడంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హజేరా ఇంటి మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. పోలీసులు అనుమానంతో ఆమె తమ్ముడు ఆయూబ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయూబ్ నేరం ఒప్పుకోవడంతో అతడి దగ్గరి నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.