పదేండ్ల లో బీఆర్ఎస్ చేసింది శూన్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేండ్ల లో బీఆర్ఎస్ చేసింది శూన్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కమీషన్ల కోసం కాళేశ్వరం, పెద్దపెద్ద భవనాలు కట్టారు: మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
  • నిధులు లేకున్నా శిలాఫలకాలు వేశారు
  • రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు
  • క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో రూ.7.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కోల్​బెల్ట్, వెలుగు:  పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ఆయన పర్యటించారు. రూ.7.65 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారోంభత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్  పాలకులు కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, పెద్దపెద్ద భవనాలు కట్టారని అన్నారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్  రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. నిధులు లేకున్నా ఓట్ల కోసం బీఆర్ఎస్ లీడర్లు శిలాఫలకాలు వేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి వల్ల ప్రాణహిత, -చేవేళ్ల ప్రాజెక్టు వచ్చిందని, అప్పటి కాంగ్రెస్  సర్కారు ఈ ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. మరో రూ.23 కోట్ల ఖర్చు చేసుంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. కేసీఆర్  ప్రాణహితను పక్కనబెట్టి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, దానితో బొట్టు నీళ్లు కూడా రాలేదని విమర్శించారు. 

కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌‌‌తో చెన్నూరు నియోజకవర్గంలోని బబ్బెరచెలక, దేవులవాడ, రాపన్‌‌పల్లి గ్రామాల్లో వందల ఎకరాల భూములు ముంపుకు గురయ్యాన్నారు. అయినా, నష్టపోయిన రైతులకు అప్పటి బీఆర్‌‌‌‌ఎస్  పాలకులు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతులను అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యాక్ వాటర్‌‌‌‌తో నష్టపోయిన పంటలకు, ముంపు కింద కోల్పోయిన భూములకు రూ.23 కోట్ల పరిహారాన్ని మంజూరే చేయించానని, ఈ మధ్యే రైతులకు వాటిని పంపిణీ చేశానని చెప్పారు. 

చెన్నూరుకు చెందిన డీఎంఎఫ్‌‌టీ, సీఎస్‌‌ఆర్ నిధులను కేసీఆర్, కేటీఆర్, హారీశ్ రావు వారి  నియోజకవర్గాలకు తరలించుకుపోయారని ఆరోపించారు. ఇక్కడి ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదని, నిధులు తరలిస్తున్నా బాల్క సుమన్  అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన రెండేండ్లయ్యిందని, అయితే, తామిచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని బీఆర్ఎస్ లీడర్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులుంటే అప్పుడే పనులేందుకు చేయలేదని వివేక్‌‌ ప్రశ్నించారు. 

కాళేశ్వరం నీళ్లతోనే సిద్దిపేట జిల్లాలో పామాయిల్ తోటలు వచ్చాయని హారీశ్​ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అంతకుముందు నుంచే అక్కడ పామాయిల్​ తోటలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్  సర్కారు వచ్చిన తర్వాత పంటల ప్రొక్యూర్​మెంట్​ రికార్డు స్థాయిలో ఉందన్నారు. 12ఏళ్ల కిందట తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించానని, ఎంపీ, ఎమ్మెల్యేగా బాల్క సుమన్  పదేళ్లున్నా బ్రిడ్జి పనులు పూర్తి చేయించలేకపోయారన్నారు. తిరిగి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించి లైటింగ్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. 

ఊరుమందమర్రి మినీ ట్యాంక్​బండ్, కుర్మపల్లి చెరువుకు బ్యూటిఫికేషన్

మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రి మినీ ట్యాంక్​ బండ్​ పరిసరాలను రూ.2.31కోట్ల అమృత్​ స్కీం నిధులతో, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కుర్మపల్లి చెరువు ప్రాంతాన్ని రూ.2.09 కోట్లతో బ్యూటిఫికేషన్  చేస్తామని వివేక్​ వెంకటస్వామి అన్నారు. వీటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుర్మపల్లి శివారులో ఓపెన్ ​జిమ్,​ రైలింగ్, చైన్​ లింక్, ఫెన్సింగ్, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. 

చెన్నూరు నియోజక వర్గంలో రూ.200 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలు చేపట్టామని, పట్టణాలు, గ్రామాల్లోని డీఎంఎఫ్​టీ, సీఎస్​ఆర్​, నగర అభివృద్ది నిధులతో పనులు జరుగుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్యాతనపల్లిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు శ్మశానవాటికలు  ఏర్పాటు చేస్తున్నామని, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్​ వాటర్​ సప్లై కోసం అమృత్​స్కీం కింద రూ.100 కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు. రూ.32 కోట్లతో క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అభివృద్ది పనులు చేపట్టామన్నారు.