కేసీఆర్​ దిష్టి బొమ్మలు కాలబెట్టినోళ్లు ఇయ్యాల స్టేజ్ ​మీదున్నరు : బీఆర్ఎస్​ కార్యకర్తలు

కేసీఆర్​ దిష్టి బొమ్మలు కాలబెట్టినోళ్లు ఇయ్యాల స్టేజ్ ​మీదున్నరు : బీఆర్ఎస్​ కార్యకర్తలు
  • బీఆర్ఎస్ ​వరంగల్​ లోక్​సభ సన్నద్ధత సమావేశంలో కార్యకర్తలు
  • పదేండ్ల నుంచి పార్టీ నిర్మాణం గురించే పట్టించుకోలేదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ​దిష్టిబొమ్మలు కాలబెట్టినోళ్లే ఇయ్యాల స్టేజీ మీద కూర్చున్నారని వరంగల్​జిల్లాకు చెందిన బీఆర్ఎస్​ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన వరంగల్​ లోక్​సభ సన్నద్ధత సమావేశంలో కార్యకర్తలు పార్టీ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు.

తాము మొదటి నుంచీ కేసీఆర్​ వెంట నడిచామని, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్​ రావు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్లపైనా పోరాటం చేశామని అన్నారు. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంత క్రియాశీలంగా ఉందో కాకతీయ యూనివర్సిటీ కూడా అంతే కీలకంగా పని చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమంలో పని చేసిన వారికి అన్యాయం జరిగిందన్నారు.

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ గురించి సమీక్ష చేయలేదని, కిందిస్థాయిలో ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి ఎమ్మెల్యేలు ధైర్యం చెయ్యలేదని తెలిపారు. పార్టీ నిర్మాణం అంటే సభ్యత్వ నమోదు మాత్రమే అనుకున్నారని, అందుకే ఎమ్మెల్యేలు పోటీలు పడి మెంబర్​షిప్​లు చేయించినట్టుగా చూపించే ప్రయత్నం మాత్రమే చేశారని చెప్పారు.

అందుకే ఇంత ఘోరంగా ఓడిపోయాం

కమ్యూనిస్టు పార్టీలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉంటాయని, ఒక్కో కమిటీ స్థాయిలో సమావేశాలు, విశ్లేషణలు జరుగుతాయని తెలిపారు. 60 లక్షల మందికిపైగా కార్యకర్తలున్న బీఆర్ఎస్​పార్టీలో మాత్రం కమిటీలు లేవు, సమీక్షలు లేవు.. అందుకే ఇంత ఘోరంగా ఓడిపోయామన్నారు. లేని బీజేపీ ఉన్నట్టు ఊహించుకొని ఆ పార్టీపై పోరాటం చేశామని, క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్​ అసలు పోటీనే కాదన్నట్టుగా చెప్పి దెబ్బతిన్నామన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులకు ఇకనైనా గుర్తింపునివ్వాలని కోరారు. బీఆర్ఎస్​పార్టీ వందేండ్లు నిలబడాలంటే సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు సమూల మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.