
- ఓటేస్తారా..? సైలెంట్ గా ఉంటారా..?
- ఎలక్టోరల్ కాలేజీలో బీఆర్ఎస్ కు 4 ఓట్లు
- వైసీపీ కి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు
- ఇండియా కూటమి వైపా..? ఎన్డీఏకు మద్దతిస్తారా?
- జగన్ కు రక్షణమంత్రి రాజ్ నాథ్ ఫోన్ కాల్
- ఇప్పటి వరకు వైఖరి వెల్లడించని ఫ్యాన్ పార్టీ
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ యావత్ దేశం చూపు తెలుగు రాష్ట్రాల వైపు మళ్లింది. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ వైఖరి ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. ఉప రాష్ట్రపతి అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఇటీవలే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో తెలంగాణకు చెందిన బీ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రంగంలోకి దించుతున్నట్టు ప్రకటించింది.
అయితే తెలంగాణను పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ లేవు. వైసీపీకి ఏడుగురు , బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్లు ఎవరికి ఓటు వేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి, మేడ రఘనాథ్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నత్వాని పరిమళ్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు.
తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, కేఆర్ సురేశ్ రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు. వీళ్లు ఎవరికి ఓటేస్తారు.. ఈ రెండు పార్టీల నాయకత్వాలు ఎవరికి మద్దతిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్ము, ఇండియా కూటమి తరఫున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు. ఆ సమయంలో అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇండియా కూటమి అభ్యర్థి సిన్హాకు మద్దతు ప్రకటించారు.
ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘనస్వాగతం పలికారు. తాము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరిని తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం ఇటీవలి కాలంలో విస్తృతంగా జరిగింది. ఈ తరుణంలో కేసీఆర్, జగన్ ఎన్డీఏ వైపు అడుగులు వేస్తారా..? ఇండియా కూటమికి జై కొడతారా..? లేదా తటస్థంగా ఉంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీ మాజీ సీఎం జగన్ కు కాల్ చేసి మద్దతు కోరారు. దీనిపై వైసీపీ వైఖరిని ప్రకటించాల్సి ఉంది.