కారును పోలిన గుర్తులను తొలగించండి..రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి

కారును పోలిన గుర్తులను తొలగించండి..రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ ఎన్నికల గుర్తయిన ‘కారు’ను పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్​ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ​ పార్టీ విజ్ఞప్తి చేసింది. కారును పోలిన గుర్తులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. మంగళవారం ఎన్నికల సంఘానికి పార్టీ వినతిపత్రాన్ని సమర్పించింది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలను అమలు చేశామని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొంది. 

కానీ, ప్రత్యర్థులు తమను దెబ్బకొట్టేందుకు కారును పోలిన గుర్తులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. కారును పోలిన గుర్తులను వాడుకోవడం ద్వారా.. కొందరు వ్యక్తులకు గుర్తింపు పొందిన పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయంది.  గుర్తుల సైజులను చిన్నగా ముద్రించడంతో.. కారు,  ఇతర గుర్తులకు మధ్య తేడాలను ఓటర్లు గుర్తించలేకపోయారని పేర్కొంది.