
హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ అం తా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఉంది. దీంతో కన్నడ నాట ఎన్నికల గురించి ప్రగతి భవన్లో, గులాబీ క్యాంపులో ఎలాంటి చర్చ జరగలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల టైంలోనే కర్నాటకపై ఫోకస్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక పోల్స్‌లో జేడీఎస్ ఒంటరిగా పోటీ చేస్తేనే మద్దతు ఇవ్వడంతో పాటు ఆ పార్టీకి ప్రచారం చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నరట. ఏదైనా పార్టీతో కలిసి జేడీఎస్ బరిలోకి దిగితే.. క్యాంపెయిన్‌కు దూరంగా ఉండాలని ఆయన అనుకుంటున్నరట. కర్నాటక ఎలక్షన్ షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో బీఆర్ఎస్ఏం చేయబోతోంది ? అనే దానిపై చర్చ మొదలైంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు, కర్నాటకలో బీఆర్ఎస్ విస్తరణ కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేసీఆర్సమావేశమవుతారనే ప్రచారం సాగింది. అయితే సాయంత్రం దాకా ప్రగతి భవన్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు.
జాతీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతదని..
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి ముందు నుంచే.. జేడీఎస్ నేత కుమారస్వామితో కేసీఆర్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. పార్టీ పేరు మార్పు.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభల్లోనూ కుమారస్వామి, రేవణ్న సహా జేడీఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడంతో.. కేసీఆర్‌తో ఆయనకు గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగింది. అయితే దీన్ని కుమారస్వామి ఖండించారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. తండ్రి దేవెగౌడతర్వాత కేసీఆరే తనకు మార్గదర్శి అని ఆయన చెప్పారు. కర్నాటకలో పాదయాత్ర ఉండటంతోనే తాను ఖమ్మం మీటింగ్‌కు రాలేదన్నారు. డిసెంబర్9న నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేస్తం. జేడీఎస్ కుసంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటం. మన రాష్ట్ర సరిహద్దు లో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కు మారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. బీఆర్ఎస్జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతది”అని వ్యాఖ్యానించారు.
జేడీఎస్, కాంగ్రెస్‌తో కలిస్తే.. బీఆర్ఎస్ కటీఫ్
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కుమారస్వామికి సపోర్ట్‌గా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన.. నాలుగు నెలల్లో పే సీన్ రివర్స్అయ్యింది. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలున్న అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. 224 స్థానాలకుగానూ 140 చోట్ల తమ పార్టీ పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. మిగతా స్థానాల్లో ఆయన ఇంకెవరికైనా మద్దతునిస్తారా.. ? కాంగ్రెస్‌తో జట్టు కడతారా ? అనే చర్చ కర్నాటకలో నడుస్తోంది. ఒకవేళ జేడీఎస్‌కు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే.. కర్నాటక అసెంబ్లీ పోల్స్‌కు పూర్తి దూరంగా ఉండాలని కేసీఆర్నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జేడీఎస్ ఒంటరిగాపోటీ చేస్తేనే మద్దతునివ్వడంతో పాటు ప్రచారానికి వెళ్లాలని.. లేదంటే లోక్‌సభ ఎన్నికల వరకూ కర్నాటక వైపు చూడాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దును ఆనుకొని ఉన్న గుల్బర్గా జిల్లాలో బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాలకు నెల రోజుల క్రితమే ఫుల్స్టాప్ పెట్టారు. దీంతో కర్నాటక అసెంబ్లీ పోరుకు గులాబీ పార్టీ దూరంగా ఉంటుందని తేలిపోయింది.