బీఆర్ఎస్ బీసీ కదన భేరీ సభ మళ్లీ వాయిదా

బీఆర్ఎస్ బీసీ కదన భేరీ సభ మళ్లీ వాయిదా
  • భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి గంగుల

కరీంనగర్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కరీంనగర్ లో బీఆర్ఎస్  నిర్వహించతలపెట్టిన బీసీ కదన భేరీ సభ మరోసారి వాయిదా పడింది. ఈసారి కూడా భారీ వర్షాల నేపథ్యంలోనే సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి, కరీంనగర్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్  మంగళవారం వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్  ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి.. ఆమోదం కోసం గవర్నర్ కు పంపగా.. గవర్నర్ రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. 

బిల్లు ఆమోదం పెండింగ్ లో ఉండడంతో ఆర్డినెన్స్  జారీ చేయడంతో పాటు ఢిల్లీలో కాంగ్రెస్  పార్టీ ధర్నా నిర్వహించింది. బీసీ రిజర్వేషన్లపై పోరాడుతున్న క్రెడిట్ అంతా కాంగ్రెస్  ఖాతాలోకి వెళ్తుండడంతో.. అప్రమత్తమైన బీఆర్ఎస్  హైకమాండ్​ కరీంనగర్  కేంద్రంగా ఆగస్టు 8న బీసీ కదన భేరీ సభను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

8న జరగాల్సిన సభను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నామని, 14న నిర్వహిస్తామని హైదరాబాద్ లో ఒక రోజు ముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. 14న నిర్వహించాల్సిన సభను కూడా రాష్ట్రంలో 14 నుంచి 17వ తేదీ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ సూచనలు, ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలతో వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్  ప్రకటించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత తేదీపై నిర్ణయం 
తీసుకుంటామన్నారు. 

సభా స్థలంపైనా చర్చ..

గతంలో కరీంనగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్  భారీ బహిరంగ సభల్లో ఎక్కువగా ఎస్ఆర్ఆర్  కాలేజీ గ్రౌండ్ లోనే నిర్వహించారు. కానీ, బీసీ గర్జన పేరుతో నిర్వహించబోయే సభకు విస్తీర్ణంలో చిన్నగా ఉండే జ్యోతిభాపూలే గ్రౌండ్(సర్కస్ గ్రౌండ్) ను ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి 10 వేల మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ స్థాయిలో తరలిస్తే ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల లెక్క ప్రకారం లక్ష మంది దాటే అవకాశముందని, సర్కస్ గ్రౌండ్ లో అంతమంది ఎలా కూర్చుంటారనే చర్చ జరుగుతోంది.