వలస బాటలో బీఆర్ఎస్ క్యాడర్

వలస బాటలో బీఆర్ఎస్ క్యాడర్
  • ఎమ్మెల్యేల తీరు నచ్చక కాంగ్రెస్​లోకి క్యూ కడ్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
  • టికెట్లు వచ్చినా పట్టించుకోకపోవడంతో బయటకు

వెలుగు,నెట్​వర్క్:అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​సెకండ్ క్యాడర్ వలసబాట పడ్తున్నది. ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన వందలాది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు.. ప్రతిపక్ష పార్టీల్లోకి ముఖ్యంగా కాంగ్రెస్​లోకి క్యూ కడ్తున్నారు. నిధులు, విధుల విషయంలో ఇన్నాళ్లూ తమను నిర్లక్ష్యం చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను అదునుచూసి దెబ్బకొడ్తున్నారు. 

అభ్యర్థులు ఎలాంటి బేషజాలకు పోకుండా క్యాడర్​ను కలుపుకపోవాలని టికెట్ల ప్రకటన తర్వాత సీఎం కేసీఆర్ చెప్పినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను, వివిధ కారణాలతో నారాజ్​గా ఉన్న సెకండ్ క్యాడర్​ను కలుపుకపోయే ప్రయత్నం చేయడంలేదు. దీంతో వలసలకు అడ్డుకట్ట పడడం లేదు. సోమవారం కూడా ఇద్దరు మున్సిపల్ చైర్​పర్సన్లతో సహా పలువురు లోకల్​బాడీల ప్రతినిధులు పార్టీని వీడివెళ్లడమే ఇందుకు నిదర్శనం.

ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చిన రోజే 
కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల భేటీ

బీఆర్ఎస్​కు చెందిన ఆరుగురు నల్గొండ మున్సిపల్​కౌన్సిలర్లు సోమవారం కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతు ఇచ్చిన వీరు 2018లో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి పనుల్లో తమ వార్డులకు ప్రయారిటీ ఇవ్వలేదని, నుడా చైర్మన్ పదవిని ఖాళీగా ఉంచడంపట్ల కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. బీఫారం తీసుకుని ఎమ్యెల్యే భూపాల్​రెడ్డి ప్రచారం షురూ చేసిన రోజే కౌన్సిలర్లు కాంగ్రెస్ నేతలతో రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, పెద్దవూర, తిరుమలగిరి, సాగర్ మండలాలకు చెందిన దాదాపు రెండు వేల మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సోమవారం సీఎల్పీ మాజీ లీడర్ జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ తీరుకు నిరసనగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, దేవరకొండ ఎంపీపీ నల్లగా సుజన్ యాదవ్, డిండి జడ్పీటీసీ మాధవరం దేవేందర్ రావు తదితరులు కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. 

నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల, నార్కట్​పల్లి, కేతపల్లి, నకిరేకల్ చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చైర్ పర్సన్ తో పాటు నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి సోమవారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి..

కరీంనగర్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్, ఆయన భార్య కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవహారశైలి నచ్చక ఇల్లంతకుంట ఎంపీపీ వూట్కూరి వెంకటరమణా రెడ్డి, మానకొండూరు ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి, వెల్జిపూర్ మాజీ సర్పంచ్ గుండా వెంకటేశ్, సింగిల్ విండో డైరెక్టర్ జంగిటి కొమురయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో చేరారు.

ఇంతకుముందు ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాఘవరెడ్డి, గన్నేరువరం మండలానికి చెందిన ఐదుగురు సర్పంచ్​లు, పలువురు ఎంపీటీసీలు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి జిల్లా మంథని క్యాండిడేట్ పుట్ట మధు తీరు నచ్చక మంథని ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్​తో పాటు వార్డ్ మెంబర్లు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో ఆదివారం గాంధీ భవన్ లో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. 

రామగిరి, ముత్తారం, కమాన్​పూర్ మండలాలకు చెందిన జడ్పీటీసీలు, సర్పంచ్​లతో పాటు మండలస్థాయి నేతలు రెండుమూడు రోజుల్లో పార్టీ మారనున్నట్టు తెలుస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే తీరుపై నారాజ్​గా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండ్ల లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు జడ్పీ చైర్ పర్సన్ సరిత వెంట కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం కరివేనకు చెందిన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శేఖర్ 40 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలు కాంగ్రెస్​ బాట పట్టారు. కడెం మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ తక్కల సత్తన్న, కన్నాపూర్ సర్పంచ్ నరేందర్ రెడ్డి, పలువురు పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. దస్తురాబాద్ మండలం పెరికపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చుంచు భూమన్న కాంగ్రెస్ లో చేరారు. ఆదిలాబాద్​ జిల్లా  మామడ  ఎంపీపీ అమృత జైసింగ్, దిమ్మదుర్తి ఎంపీటీసీ పడాల శ్రీనివాస్, కుబీర్ మండలం నిగ్వా ఎంపీటీసీ దేవిదాస్ బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 

వికారాబాద్​లో కాంగ్రెస్ సభ ముగిసిన తర్వాత సోమవారం రాత్రి పీసీసీ చీఫ్ రేవంత్ శంషాబాద్​లోని ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రతాప్ రెడ్డితో పాటు కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల, కొత్తూరు మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, ఫరూఖ్ నగర్​కు చెందిన బీఆర్ఎస్ నేతలు వెంకట్రామిరెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నగర్ బీఆర్ఎస్ ఇన్ చార్జి ముద్దగౌని రామ్మోహన్ రెడ్డి దంపతులు మూడ్రోజుల కిందట బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 

ఆయన 2014, 2018లో బీఆర్ఎస్ తరఫున ఎల్ బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రామ్మోహన్ రెడ్డి  భార్య లక్ష్మీప్రసన్న బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్. భార్యతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరారు.మహేశ్వరం సెగ్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ ఎంపీపీ రఘుమారెడ్డి 15 రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

బుజ్జగింపులకు బదులు  బెదిరింపులు..

సీఎం కేసీఆర్ ఇచ్చిన అండతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లో సామంతుల్లా వ్యవహరించారు. గడిచిన ఐదేండ్లలో ‘ఫండ్స్ మావే.. పనులు మావే’ అంటూ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లను వేలుపెట్టనీయలేదు. స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద సీఎం కేసీఆర్ ​గ్రామాలకు సాంక్షన్ చేసిన పనులను సైతం సర్పంచులకు ఇవ్వకుండా తమ అనుచరులు, సొంత కాంట్రాక్టర్లతోనే ఎమ్మెల్యేలు చేయించుకున్నారు.

లక్షలు పెట్టి గెలిచామని, తమకు చిన్నచిన్న పనులైనా అప్పగించాలని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలాగూ వస్తారు కదా, తమ డిమాండ్లు సాధించుకోవాలని భావించిన లోకల్ ​లీడర్లకు చివరికి నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు వస్తాయని అప్పుడు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తమదే కనుక మళ్లీ పదువులు రావాలంటే తమకు సహకరించాల్సిందేనని, లేదంటే భవిష్యత్ ఉండదనే స్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు కూడా దిగారు.