షెడ్డులో కారు.. ఫామ్ హౌస్ లో స్టీరింగ్

షెడ్డులో కారు.. ఫామ్ హౌస్ లో స్టీరింగ్
  • పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కామెంట్
  • స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా

జమ్మికుంట, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మాజీ సీఎం కేసీఆర్‌‌ తన నిర్ణయాన్ని చెప్పాలని  పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లో గురువారం ఆయన పర్యటించి చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా మాట్లాడారు. 

బీఆర్‌‌ఎస్‌ కారు షెడ్ కు పోయిందని, స్టీరింగ్ ఫామ్ హౌస్ లో ఉందని, రెండు టైర్లు కేటీఆర్, హరీశ్‌ రావు పార్టీలో ఉండగా.. మిగిలిన రెండు టైర్లను కవిత, సంతోష్ రావు లాగేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలకు టికెట్లను ఇచ్చి, ప్రతి ఒక్కరిని గెలిపించుకుని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించకుండా  బద్నాం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. జమ్మికుంట నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్  నడిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తానన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాల మెరుగుకు ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రణవ్ బాబు, నేతలు పొన్నగంటి మల్లయ్య, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, శ్రీకాంత్, విష్ణు, రంజిత్ పాల్గొన్నారు.