12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్

12  సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్
  • భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడుతం
  • జైళ్లకు, తోకమట్టలకు కేసీఆర్​ భయపడ్తడా?
  • ప్రజలకు, కాంగ్రెస్​కు మధ్య పంచాయితీ పడ్డది
  • ప్రజల తరఫున బీఆర్ఎస్​ పోరాడుతది
  • ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు.. ఇనుము కూడా ఇయ్యలే
  • మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిన్రు
  • కాళేశ్వరంపై దుష్ర్పచారం చేసి, నీళ్లురాకుండా చేశారని కామెంట్​
  • బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమా

నల్గొండ/ సూర్యాపేట , వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను 10, 12  సీట్లలో  గెలిపిస్తే భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా  కాంగ్రెస్​ ప్రభుత్వంపై పోరాడుతామని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. తాను జైళ్లకు భయపడేటోన్ని కాదని పేర్కొన్నారు. తొలిరోజు బస్సుయాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో జరిగిన రోడ్​ షోలో కేసీఆర్​ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్​ మోసం చేసి గద్దెనెక్కిందని, బీఆర్ఎస్​ అభ్యర్థులను గెలిపిస్తే  ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు  చేయిస్తానన్నారు.  ‘‘కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నరు. 

ఈ జైళ్లకు.. తోకమట్టలకు  కేసీఆర్​ భయపడ్తడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘15 ఏండ్లు తెలంగాణ కోసం పోరాడిన. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా చూసిన. అలాంటి నన్ను పట్టుకుని పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటడా?’’ అని సీఎం రేవంత్​రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆరు హామీలకు కాంగ్రెస్​ పంగనామాలు పెట్టి చేతులెత్తేసిందని విమర్శించారు.  ‘ప్రపంచంలో ఎక్కడా లేనట్టు 125 అడుగుల అంబేద్కర్​ విగ్రహాన్ని హైదరాబాద్​లో పెడితే.. ఆయన​జయంతి రోజున సీఎం, మంత్రులు అక్కడికి పోలే. గేట్లకు తాళం వేసిన్రు. వేరే రాష్ట్రాల ప్రజలు కూడా వ చ్చి తిట్టుకుంటూ పోయిన్రు’ అని అన్నారు.  

మీ తరఫున కొట్లాడే పెద్దమనిషిని నేను..

‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్​ ప్రజల్ని మోసం చేసింది. రైతుబంధు, రైతుబీమా పథకాలు వస్తయో రావో కూడా అర్ధం కాకుండా పోయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇప్పుడు అనలేదంటున్నరు. కల్యాణలక్ష్మి కింద మేం రూ.లక్ష ఇచ్చినం. కానీ కాంగ్రెస్​ దాంతోపాటు తులం బంగారం ఇస్తా అని చెప్పింది. తులం బంగారం కాదుగదా ఇనుము కూడా ఇయ్యలేదు’ అని కేసీఆర్ అన్నారు. రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తానని మోసం చేశారని చెప్పారు.  ఐదు నెలల్లోనే  రాష్ట్రం  ఆగమైందని అన్నారు. 

 పాలోళ్ల నడుమనో.. పడనోనితోనో..  అన్యాయం చేసినోనితోనో ఊల్లె పంచాది  పడితే పెద్దమనిషిని కోరుకుంటరు కదా..  అట్లనే ఇయ్యాల హామీలు ఇచ్చి ఎగ్గొడుతున్న కాంగ్రెస్ తోని తెలంగాణ ప్రజలకు పంచాది వచ్చింది. మరి ఎవరో  తెంపాలే కదా ఈ పంచాది.  మీ తరఫున కొట్లాడే పెద్దమనిషి ఎవరు? మీ తరఫున నేను కొట్లాడుతా’ అని కేసీఆర్​ అన్నారు. తప్పక మళ్లీ మన రాజ్యమే వస్తదని, ఎవడూ దాన్ని ఆపలేడని, మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాధించి తీరుతామని ధీమా వ్య క్తం చేశారు. 

బీఆర్ఎస్​కు మీ బలం కావాలి 

పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​ను​ గెలిస్తే అది తెలంగాణ ప్రజల శక్తి అవుతుందని,  మీ తరఫున ప్రభుత్వం మెడలు వంచగలుగుతామని  కేసీఆర్ ప్రజలతో అన్నారు.  ‘బీఆర్ఎస్ హయాంలో అన్నీ అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ పక్కకు పోంగనే కట్కా బంద్​జేసినట్టు నీళ్లు బందైనయ్​..  కరెంటు బందైంది’  అని పేర్కొన్నారు.  రైతుబంధులో దగా, రైతుబీమా ఉంటదో? ఊడతదో? కూడా తెల్వదని అన్నారు. ‘తొమ్మిదేండ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బాగు చేసి  అప్పగించినం. సరిగ్గా కరెంట్​ ఎందుకు ఇస్తలేరు?  మిషన్​ భగీరథ  ఎందుకు నడపలేకపోతున్నరు?  కేసీఆర్​ పక్కకు పోగానే ఎందుకింత అవస్థ పడుతున్నరు? అని ప్రశ్నించారు. 

రెండు పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిన్రు

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కూలితే  ప్రపంచమే మునిగిపోయినట్టు దుష్ర్పచారం చేసి మొత్తానికే నీళ్లు రాకుండా చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై కేసీ‌ఆర్ మండిపడ్డారు. 60, 70 టీఎంసీల నీటిని  సముద్రంలోకి వదిలిపెట్టారని, వాటిని కరెక్ట్ గా ఎత్తిపోస్తే ఒక్క ఎకరా  కూడా ఎండిపోయేది కాదని అన్నారు.     సూర్యాపేటలో 30 ఏండ్లు మూసీ మురికి నీళ్లను కాంగ్రెస్ తాగిస్తే.. తాము పెద్ద దేవులపల్లి, టెయిల్ పాండ్, పాలేరు నుంచి నీళ్లు అందించామని చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కూడా ప్రభుత్వానికి కొనే తెలివి లేదన్నారు.  గురుకుల పాఠశాలల్లో తిండి సరిగా పెడ్తలేరని, వందకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని,  కొందరు చనిపోయారని తెలిపారు.   కేసీఆర్​ వెంట ఎమ్మెల్యే జీ జగదీశ్​రెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​రెడ్డి, నల్లమోతు భాస్కర్​ రావు తదితరులున్నారు.

నల్గొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు 

‘నల్గొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఉన్నడు.. దద్దమ్మలాగా నాగార్జునసాగర్​ కట్టను  కేఆర్ఎంబీకీ అప్పగించిండు. ఇక మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడ్తా అంటున్నడు. నీ చెప్పుల కంటే మా రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటయని చెప్పిన’ అని కేసీఆర్​అన్నారు. 1956 నుంచి నేటి వరకు మన శత్రువు కాంగ్రెస్సేనని,   మొన్న అడ్డగోలు హామీలతో  ఉడుముల్లాగా వచ్చి మళ్లీ  తెలంగాణ ప్రజలను అవస్థలు పెడుతున్నారని మండిపడ్డారు.  

బీఆర్ఎస్  పదేండ్లు అధికారంలో ఉంటే వెనకాముందాడకుండా సాగర్​ ఆయకట్టు కింద 18 పంటలకు నీళ్లు ఇచ్చామని  చెప్పారు. 
ఈ దద్దమ్మలకు దమ్ములేక ప్రాజెక్టును  కేఆర్ఎంబీకీ తాకట్టు పెట్టి.. పంటలను ఎండబెట్టారని మండిపడ్డారు. ఈ జిల్లా మంత్రులు కేసీఆర్​ను తిట్టి   పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.  

 రైతుబంధు గురించి అడిగితే  ఐదెకరాలు అని మాట్లాడుతున్నరని,  ప్రభుత్వ సాయం లేకుండా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని చెప్పారు. తమ హయాంలో ఏడాదికి రూ .16 వేల కోట్లు రైతుబంధు కింద ఇచ్చామని తెలిపారు.  ‘నల్గొండ పక్కనే ఆర్జాలబావి సెంటర్​ వద్ద వడ్లు కొనుగోలు చేయక 25 రోజులైందని రైతులు నాతో చెప్పిన్రు. ప్రధాని మోదీ నేను వడ్లు కొననని మొండికేస్తే నాతో సహా మంత్రులు ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచాం’ అని అన్నారు.